14 March, 2026 | 11:43 PM

అణగారిన వర్గాల కోసం ప్రాణాలర్పించిన వీరుడు అనభేరి ప్రభాకర్ రావు

14-03-2026 08:19 PM

- సీపీఐ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

కరీంనగర్,(విజయక్రాంతి): దేశ్ ముఖ్ ల కుటుంబంలో పుట్టినా,వందల ఎకరాలు భూములు ఉన్నప్పటికీ, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం, తాడిత, పీడిత అణగారిన వర్గాల కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా వదలడమే కాకుండా, నిజాం నవాబు రజాకార్ పోలీస్ మూకలపై రణభేరి మ్రోగించిన తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట యోధుడు అనబేరి ప్రభాకర్ రావు అని సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. శనివారం అనభేరి ప్రభాకర్ రావు 78వ వర్ధంతి సందర్భంగా నగరంలోని ఆయన విగ్రహానికి సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో కలిసి చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో జన్మించిన అనభేరి ప్రభాకర్ రావు తన చిన్నతనం నుండే ఎదిరించే స్వభావాన్ని కలిగి ఉన్నాడని, దున్నేవానికి భూమి కావాలని, వెట్టిచాకిరి విముక్తి కావాలని పోరాటం చేశారని అన్నారు. ప్రజల కోసం పనిచేసే అమరత్వం పొందిన అమరవీరుల ఆశయాలను కొనసాగించడం కోసం కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల మధ్య ఉండి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు, పోరాటాలు చేయాలన్నారు.