భరోసా కేంద్రాలతో బాధితులకు అండ
బాధితుల సంరక్షణపై డీసీపీ సృజన కీలక సూచనలు
శేరిలింగంపల్లి, జూన్ 10 (విజయక్రాంతి): అత్యాచారం, చిన్నారులపై లైంగిక వేధింపుల వంటి తీవ్ర నేరాల బాధితులకు ఒకేచోట అన్ని సేవలు అందించే భరోసా, సీడీఈడబ్ల్యూ కేంద్రాల పనితీరును మరింత బలోపేతం చేసేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించినట్లు సైబరాబాద్ ఉమెన్ అండ్ చైల్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కర్ణం వెల్లడించారు.
సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం.రమేష్ ఆదేశాల మేరకు సీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలను డీసీపీ సృజన వెల్లడించారు. తీవ్ర నేరాల బాధితులకు వెంటనే భరోసా కల్పించడం, వారి హక్కులను పరిరక్షించడం, న్యాయ ప్రక్రియలో మరింత మానసిక క్షోభకు గురికాకుండా జీవితాన్ని తిరిగి నిర్మించుకునేందుకు సమగ్ర సహాయం అవసరమని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.
ఈ అవసరాన్ని గుర్తించే తెలంగాణ పోలీసులు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారని, ఈ కేంద్రాల్లో న్యాయ సహాయం, వైద్య సేవలు, మానసిక సలహా, పునరావాసం వంటి అన్ని సేవలు ఒకే కప్పు కింద అందుబాటులో ఉంటాయని చెప్పారు.
ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి డాక్టర్ అనుష, రంగారెడ్డి జిల్లా సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ కె. నరేందర్ రెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన రాజా రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంగా బి. భిక్షపతి, విద్యా శాఖ ప్రభాకర్ రెడ్డి, సీఎంవో బి. వెంకటేష్, డీసీపీవో ఇంతియాజ్ రహీం, డాక్టర్ ఉమా దీపిక, డాక్టర్ లావణ్యతో పాటు సైబరాబాద్కు చెందిన పలువురు సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.






