ఇజ్రాయెల్ నరమేధం
పాలస్తీనాలో ఇజ్రాయెల్ నరమేధానికి అంతులేకుండా పోతోంది. హమాస్ ఉగ్రవాదులను అంతమొందించడమే లక్ష్యంగా సాగుతున్న దాడుల్లో వేలాదిమంది అమాయక పౌరులు అసువులు బాస్తు న్నారు. తాజాగా టెల్ అవివ్‌పై హమాస్ రాకెట్ దాడులకు ప్రతీకారంగా గాజాలోని రఫా ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 45 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో సగానికి పైగా చిన్నారులు, మహిళలు ఉన్నట్లు గాజా ప్రభుత్వం ప్రకటించింది. మృతులను, క్షతగాత్రులను తీసుకెళ్లేందుకు రఫాలో సరిపడా సామ ర్థ్యం ఉన్న ఆస్పత్రులేమీ లేకపోవడంతో వారి బంధువుల ఆర్తనాదాలకు అంతులేకుండా పోతోంది. కాగా, ఆదివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిన ఈ ప్రాంతం వలసదారులతో కూడిన తాత్కాలిక శిబిరం అని పాలస్తీనా రెడ్ క్రిసెంట్ సొసైటీ ప్రకటించింది. చాలా కుటుంబాలు తలదాచుకుంటున్న ఓ పెద్ద కంటైనర్, దాని చుట్టూ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్లపై ఇజ్రాయెల్ 2 వేల పౌండ్ల బాంబుల వర్షం కురిపించినట్లు గాజా ఆరోగ్యశాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతాలన్నీ ఇజ్రాయెల్ స్వయంగా సురక్షితమైనవిగా గుర్తించిందని, పౌరులు, వలసదారులు అక్కడ తలదాచుకోవాలని కూడా సూచించిందని గాజా ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. తాము ఇచ్చిన మాటను తామే ఉల్లంఘించి ఇజ్రాయెల్ దళాలు పాశవికంగా అమాయకులను పొట్టన పెట్టు కున్నాయని వారు మండిపడుతున్నారు. సోమవారం ఉదయానికి కూడా పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతుండడం, సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. చనిపోయిన వారిలో చాలామంది మృతదేహాలు గుర్తు పట్ట లేనంతగా కాలిపోయాయని అధికారులు అంటున్నారు. రఫా ఘటనపై ప్రపంచదేశాల నేతలు సైతం తీవ్రంగా మండి పడుతున్నారు. ఇజ్రాయెల్ దాడి దారుణమైందని ఫ్రాన్స్‌సహా ఐరోపా సమాజం సభ్యదేశాలు తీవ్రం గా ఖండించాయి. ఇజ్రాయెల్ దాడి అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించడమేనంటూ ఈజిప్టుసహా అరబ్ దేశాలు అభివ ర్ణించాయి. రఫాపై వైమానిక దాడులను తక్షణమే నిలిపివేయాలని ఐసీజే రెండు రోజుల క్రితమే ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ మరోసారి పెద్ద ఎత్తున వైమానిక దాడులు జరప డంపై ప్రపంచ దేశాలన్నీ మండి పడుతున్నాయి. అయితే, ఇజ్రాయెల్ రక్షణదళం ఐడీఎఫ్ వాదన మాత్రం భిన్నంగా ఉంది. ఆ ప్రాంతంలో హమా స్ మిలిటెంట్లు తలదాచుకున్నారని, అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని తెలిపింది. ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్న తర్వాతే దాడి చేశామని పేర్కొంది. తమ దాడుల్లో జుడియా, సమరియాలోని హమాస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌లతోపాటు మరో సీనియర్ అధికారి హతమయ్యారని కూడా చెప్పుకొంది. అయితే, రఫాపై తాము జరిపిన దాడుల్లో కొంతమం ది సామాన్య పౌరులు ప్రభావితమైనట్లు తెలుసునని కూడా ప్రకటించింది.
రఫాపై ఇజ్రాయెల్ దాడికి కొన్ని గంటల ముందు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై హమాస్ రాకెట్ల వర్షం కురిపించింది. ఈ దాడులతో ఇజ్రాయెల్ రాజధానిలో సైరన్లు సైతం మోగాయి. పలు ప్రాం తాల్లో భారీ ఎత్తున పొగలు వస్తున్న దృశ్యాలూ కనిపించాయి. టెల్ అవీవ్‌లో సైరన్లు మోగడం అయిదు నెలల్లో ఇదే మొదటిసారి. అయితే, హమాస్ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని కూడా ప్రకటించింది. ఇది జరిగిన కొద్ది గంటలకే రఫాపై వైమానిక దాడులు జరిపింది. గత ఏడాది అక్టోబర్‌లో పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు మొదలైన తర్వాత ఈ ఎనిమిది నెలల కాలంలో 35 వేలమందికి పైగా చనిపోగా, 80 వేలమందికి పైగా గాయపడినట్లు గాజా ప్రభు త్వం తాజాగా వెల్లడించింది. ఓవైపు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు జరుగుతుండగానే తాజాగా జరిగిన దాడి అక్కడ మరింతగా ఉద్రిక్తతలను పెంచే ప్రమాదం ఉంది.






