13 May, 2026 | 2:50 PM

ప్రశ్నిస్తే సస్పెన్షన్

28-08-2024 01:16 AM
  1. ఎస్సీ గురుకులాల్లో బదిలీల పంచాదీ 
  2. ఉద్యోగుల ఇబ్బందులు పట్టని అధికారులు 
  3. ధర్నా చేసినందుకు 142 మందికి నోటీసులు 
  4. అధికారుల అవగాహన లోపంతో పోస్టింగుల్లో సమస్యలు

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా 317 జీవో ప్రకారం చేపట్టిన ఉద్యోగుల బదిలీ ఎస్సీ గురుకులాల్లో చిచ్చు రేపుతున్నది. సమస్యలపై గళమెత్తిన వారిని ఎస్సీ గురుకులాల సొసైటీ ఏమాత్రం సహించడం లేదు. తమ సమస్యలు పరిష్కరించాలని సొసైటీని ప్రశ్నిస్తే సస్పెన్షన్‌తో వారికి జవాబు చెప్పింది. ధర్నాలో పాల్గొన్నందుకు మహిళా ఉపాధ్యాయురాలిపై ఉక్కుపాదం మోపింది. సమస్యను పరిష్కరించాల్సింది పోయి సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేసింది.

వాస్తవానికి 317 జీవో ప్రకా రం ఎస్సీ గురుకులాల్లో ఇప్పటికే 1000 మంది ఉద్యోగులు పోస్టింగ్ తీసుకున్నారు. ఇంకా 172 మంది ఉద్యోగులు డిస్ లోకేట్ కారణంగా పోస్టింగ్ తీసుకోలేకపోయారు. ఈ సమస్యపై వీరు కోర్టును ఆశ్రయించి స్టే కూడా తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో కొం దరు ఉద్యోగులు అలాట్‌మెంట్‌కు అనంతరం నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కాలేదు. దీంతో వారు ఇబ్బందుల పడుతున్నారు. తమ బదిలీ, ఇతర సమస్యలపై పునరాలోచించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.  

142 మంది ఉద్యోగులకు నోటీసులు..

ఎస్సీ గురుకులాల్లో కొన్ని చోట్ల ఒకే పోస్టుకు ఇద్దరు, ముగ్గురిని కేటాయించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఈ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగులు కోర్టు నుంచి స్టే తీసుకొచ్చిన ఎస్సీ గురుకులాల కార్యదర్శి కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. కానీ ఈ ధర్నాపై ఎస్సీ గురుకులాల కార్యదర్శి, అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా చేసిన 142 ఉద్యోగులను గుర్తించి వారికి క్రమశిక్షణా రాహిత్యానికి సంబంధించిన నోటీసులు జారీ చేశారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారుల చర్యలపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గందరోగళానికి గతంలోనే పునాది..

గత ప్రభుత్వం హయాంలో ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమా ర్ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడమే ప్రస్తుతం నెలకొన్న గందరగోళానికి కారణమని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అవకాశం లేని చోట పోస్టింగ్ ఇవ్వడం, ఒక టీచర్ అవసరం ఉన్న చోట ఇద్దరిని నియమించడం, ఆయా స్థానాల్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ మందిని నియమించడం వంటి చర్యలే ప్రస్తుత పరిస్థితి కారణం. ఒక ప్రణాళిక ప్రకారం చేపట్టాల్సిన ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో 317 జీవో, ఎక్సెస్ పోస్టిం గ్, జనరల్ ట్రాన్స్‌ఫర్స్ మధ్య సమన్వయ లోపం కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఒకే చోట, ఒకే సబ్జెక్టుకు ఇద్దరు లేక ముగ్గురు ఉపాధ్యాయులను కేటాయించారు. కొన్ని చోట్ల అసలు ఉపాధ్యాయులే లేకుండా పోయారు. 

సస్పెన్షన్ వేటు..

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో సోషల్ స్టడీస్ బోధించే ఉపాధ్యాయురాలు విజయ నిర్మల.. ఆ పాఠశాల ప్రిన్సిపాల్, హెడ్ ఆఫీస్ స్టాఫ్‌పై ఆరోపణలు చేసింది. పోస్టింగ్ ప్రక్రియలో వారు పక్షపాత ధోరణి అవలభించా రని ఆరోపించింది. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని తెలిపింది. తమ పోస్టింగ్, బదిలీల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ప్రశ్నిస్తూ ధర్నాలో పాల్గొన్నందుకు ఉపాధ్యాయురాలు విజయ నిర్మల సస్పెన్షన్‌కు గురైంది. విజయ నిర్మల చేసిన ఆరోపణలకు సంబంధించిన సరైన ఆధారాలను సమర్పించ కపోతే చట్టపరమైన చర్యలను తీసుకుంటామని హెచ్చరించిన గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి... చెప్పినట్టుగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది.

విధి నిర్వహణలో సరైన ప్రవర్తనను కనబర్చకపోవడం, ప్రభుత్వ సొమ్మును ధ్వంసం చేయడం, సీనియర్ ఉన్నతాధికారులను అవమాన పర్చడం, ఎస్సీ గురుకులాల ప్రధాన కార్యాలయం వద్ద న్యూసెన్స్ చేయడం వంటి కారణాలను చూపుతూ విజయ నిర్మలను సస్పెండ్ చేశారు. అయితే సొసైటీ చర్యలపై ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు స్పందిస్తూ తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా నిజాలు వెల్లడించిన వారిపై చర్యలు తీసుకుంటామనడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అవగాహన లోపంతోనే సమస్య..

బదిలీ ప్రక్రియ సజావుగా జరగాలంటే ముందుగా ఖాళీ జాబితా సిద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులకు సరైన అవగాహన లేకపోవడంతో ఉద్యోగుల నియామ కం, ఖాళీల జాబితాపై రికార్డులు సరిగా నిర్వహించలేదు. తద్వారా హడావుడిగా కౌన్సెలింగ్ నిర్వహించడంతో బదిలీ ప్రక్రియలో గందర గోళం నెలకొన్నది. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ హయాంలో జరిగిన అవకతవక లకు తోడు తర్వాత వచ్చిన కార్యదర్శులు, అధికారుల అనుభవ రాహిత్యం తోడైంది.

స్టాఫ్ ప్యాట్రన్‌పై సరైన అవగాహన లేకుండా బదిలీ, పోస్టింగులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. స్టాఫ్ ప్యాట్రన్ ప్రకారం ఒక పోస్టు ఉన్నప్పటికీ కొని చోట్ల దగ్గర ఇద్దరి అవసరం ఉంటుంది. గతంలో ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్ అవసరాన్ని బట్టి ఉద్యోగులకు పోస్టింగు ఇచ్చారు. పోస్టు లేకున్నా ఉద్యోగులను భర్తీ చేసి ఇప్పుడు వారిని అడ్జెస్ట్ చేయలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.  

చాలా మంది మహిళలే..

బదిలీ ప్రక్రియలో భాగంగా మహిళా ఉద్యోగులు నేటివిటీ, స్పౌజ్ కేస్ వంటి సమస్యలతో సతమతమతున్నారు. కొంతమంది మహిళలకు 300 కిలోమీటర్లపైగా దూరంలో పోస్టింగ్ రావడంతో నానా తంటాలు పడుతున్నారు. కుటుంబాన్ని, పిల్లలను, ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక సతమతమవతున్నారు. నోటీసులు అందుకున్న వారిలో చాలా మం ది మహిళలే ఉన్నారు. ధర్నా చేసినంత మాత్రానా  నోటీసులు జారీ చేయడం, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం సరికాదని, కోర్టు తీర్పు వెలువడే వరకు సమయం ఇస్తే బాగుటుందని కుల పాఠశాలల ఉద్యోగ సంఘ నాయకులు అభిప్రాయపడుతున్నారు.