తినబోతే తీపి.. అమ్మబోతే బీపీ!

22-04-2024 12:34:32 AM

l ఆపదలో కొల్లాపూర్ బేర్నీషా మామిడి

l ఓవైపు తెగుళ్లు.. మరో వైపు దళారుల దోపిడి

l పెట్టుబడులు కూడా చేతికందని దుస్థితి

l హామీలుగానే మిగిలిన మామిడి మార్కెటింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు

l ఆవేదన చెందుతున్న రైతులు

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ ౨౦ (విజయక్రాం తి) : మామిడిని ఫలాల్లో రారాజు అంటారు. కానీ మామిడి తోటలు సాగు చేసే రైతులు మాత్రం రాజులు కాలేకపోతున్నారు. సాగు మొదలు.. పంట మార్కెట్‌లో అమ్మే వరకు కష్టాలే. సాగు సమయంలో తెగుళ్ల కారణంగా భారీగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంటే.. పంట విక్రయించే సమయంలో ధర రాక కుదేలవుతున్న పరిస్థితి. 

కుదేలవుతున్న రైతులు..

నోరూరించే మామిడి పండ్ల సాగుకు కొల్లాపూర్ ప్రసిద్ధి. దేశ విదేశాల్లో పేరొందిన కొల్లాపూర్ బేర్నీషా మామిడిని ప్రస్తుతం ఈ ప్రాంతంలో సాగు చేయాలంటేనే రైతులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి ఏడాది వాతావరణ మార్పుల కారణంగా తెగుళ్ల బారిన పడి ఆశించిన ఫలితాలు రాక రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అప్పులు చేసి తెగుళ్ల నివారణకు పురుగు మందులు పిచికారీ చేయడంతో పంట దిగుబడిపై ప్రభావం  చూపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పడమే తప్ప క్షేత్రస్థాయిలో అవి రైతులకు చేరడం లేదన్నది విమర్శ.

తెగుళ్ల నివారణపై సూచనలు చేయాల్సిన హార్టికల్చ ర్ అధికారులు, ప్రొఫెసర్లు సైతం కార్యాలయాలను వదిలి క్షేత్రస్థాయికి వెళ్లకపోవడం తో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట ను అమ్ముకోవడానికి తలకు మించిన భారంగా మారుతోంది. ఈ ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు కూడా లేకపోవడంతో హైదరాబాద్, ఇతర ప్రధాన నగరాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. రవాణా ఖర్చులు ఒకవైపు ఉండగా.. తరుగు పేరుతో దళారులు మోసగిస్తున్నారని, క్వింటాకు కేవలం రూ. 350 మాత్రమే ధర నిర్ణయించడంతో గిట్టుబాటు కావడం లేదని అన్నదాతలు లబోది బోమంటున్నారు. ప్రభుత్వాలు గతంలో కొనుగోలు కేంద్రాలతో పాటు మామిడి జ్యూస్, ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పుతామని ఇచ్చిన హామీలు నెరవేరలేదని, చేసే దేమీ లేక సాగు మానుకునే స్థితికి వచ్చామ ని రైతులు ఆవేదన చెందుతున్నారు. 

16,165 ఎకరాల్లో..

నాగర్‌కర్నూల్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండగా.. కల్వకుర్తిలో 5,309 ఎకరాలు, నాగర్‌కర్నూల్‌లో 1,692, అచ్చంపేటలో 2,280, కొల్లాపూర్‌లో 6,884 ఎకరాల్లో మొత్తంగా 16,165 ఎకరాల్లో రైతులు మామిడి సాగు చేస్తున్నారు. ముందుగా కొల్లాపూర్ సంస్థానంలో సురభి రాజు వెంకట లక్ష్మారావు వందేళ్ల క్రితం నూజివీడు నుంచి నాణ్యమైన మామిడి వంగడాన్ని తీసుకువచ్చి ఈ ప్రాంతంలో కొన్ని మొక్కలను నాటించారని చరిత్ర చెబుతోంది. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం బేర్నీషా, నూజివీడు, బంగినపల్లి, చిన్నరసాలు, పెద్దరసాలు, మల్లిక, దశేరి, హిమాయత్, కేసర్ వంటివి రకాల మామిడి పండ్ల సాగుకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. 

కొల్లాపూర్ మామిడికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్‌తో కూడిన గుర్తింపు సైతం లభించింది. అందుకే కొల్లాపూర్‌లో పండిన మామిడిని దేశవిదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. కానీ స్థానికంగా మామిడి రైతులను పట్టించుకోకపోవడంతో అవస్థలు పడుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర పలికేలా స్థానికంగానే కొనుగోలు కేంద్రాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పితే మేలు జరుగుతుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ఖర్చులు మీద పడ్డాయి..

నాకున్న నాలుగు ఎకరాలతో పాటు ఇతరుల వద్ద 16 ఎకరాల మామిడి తోటలను కౌలుకు తీసుకు న్నా. పూత దశలో ఉండగా తెగులు సోకింది. రకరకాల మందులను పిచికారీ చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అధికారులు పట్టించుకోలేదు. ఎకరాకు టన్ను కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికీ కాయ తోట మీ ద నుంచి తీయలేదు. ఖర్చులు మాత్రం 12 లక్షలు అయ్యాయి. చివరికి అమ్ముకుందామన్నా కొనుగోలు కేంద్రాలు లేవు. దీంతో దళారులు తక్కువ ధరకు అడుగుతున్నారు. 

 సొప్పరి స్వామి, రైతు కోడేరు

చెట్టును పూర్తిగా తొలించాల్సిన పనిలేదు


ముదురు తోటల్లో క్రమక్రమంగా దిగుబడి తగ్గిపోతుంది. దానికి తోడు అన వ సరమైన పురుగు మందులు వాడడం మరో కారణం. దిగుబడి తగ్గినప్పుడు చెట్లును పూర్తిగా తొలగించకుండా మాను వరకు మిగిలిస్తే మరో పదేళ్లలో మంచి దిగుబడి వచ్చే మామిడి తోట అందుబాటులోకి వస్తుంది. ఇందుకు ప్రభుత్వం కూడా ఖర్చులు భరిస్తోంది. మామిడి రైతులు ఫర్టిలైజర్ దుకాణాల్లో ఇచ్చిన మందులు వాడి మోసపోతున్నారు. 

 ఆదిశంకర్, ప్రొఫెసర్, పాలెం కళాశాల