ఉమ్మడి ఖమ్మంలో అకాల వర్షం

22-04-2024 12:36:14 AM

l రహదారులపై విరిగిపడ్డ చెట్లు

l రాకపోకలకు తీవ్ర అంతరాయం

l కరకగూడెంలో పిడుగుపాటుకు రెండు ఎడ్లు మృత్యువాత

ఖమ్మం, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తం గా ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలో పలుచోట్ల చెదురుమదురు వానలు పడ్డా యి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంట పాటు వర్షం కురిసింది. ఇల్లెందు, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాల్లో భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలకు కరకగూడెం, పినపాక మండలాల్లో విద్యుత్తు స్తంభాలు విరిగిపోయాయి. చెట్లు రోడ్లపై కూలిపోవడంతో కరకగూడేనికి రాకపోకలు నిలిచిపోయాయి.

కరకగూడెం, పినపాక మండలాలకు విద్యు త్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ పట్టణంలో కురిసిన వర్షానికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి.  కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు రైతులు శ్రమించారు.  అధికారులు పంటనష్టం అంచనా వేస్తున్నారు. పినపాక మండ లం ఐలాపురం గొట్టెల్ల నుంచి మల్లారం, జానంపేట వరకు ప్రధాన రహదారిపై దాదాపు 20 చెట్లు వేర్లతోసహ కూలిపోయా యి. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జాం అయింది. పిడుగుపడి కరకగూడెం మండలం రేగుళ్ల గ్రామానికి చెందిన గోగు రాంబాబుకు చెందిన ఎడ్లు మృత్యువాత పడ్డాయి.  

అన్నదాతలు అధైర్యపడొద్దు

l ప్రతిగింజను కొనుగోలు చేస్తాం: సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి

సిద్దిపేట, ఏప్రిల్21(విజయక్రాంతి): రెండురోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు అధైర్యపడొద్దని, ప్రతిగింజను కొనుగోలు చేస్తామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి అన్నారు. శుక్రవారం వరిధాన్యం కొనుగోళ్లపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 418కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 2365మంది రైతుల నుంచి 11,305 మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. అన్నీ కేంద్రాల్లో సరిపడా టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉన్నాయయని, అకాల భారీ వర్షాల దృష్ట్యా ఇంకా అవసరమగు చోట్ల టార్ఫాలిన్ కవర్లు సమకూర్చాలని, జాప్యం చేయకుండా ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించాలని డీఆర్‌డీవో జయదేవ్, డీసీవో తనూజ, మెప్మా పీడీ హన్మంతరెడ్డిలను ఆదేశించారు.