29 June, 2026 | 2:01 AM

జిల్లా ఆస్పత్రిలో గాడి తప్పిన వ్యవస్థ..!

29-06-2026 12:00 AM

విధులకు డుమ్మా కొట్టి రిజిస్టర్లో సంతకాలు..!

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో బయటపడిన నిర్లక్ష్యం

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): పేదలు, గిరిజనులకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలపై గత కొంతకాలంగా వస్తున్న ఆరోపణలు తాజాగా జిల్లా కలెక్టర్ కె. హరిత నిర్వహించిన ఆకస్మిక తనిఖీతో మరోసారి చర్చనీయాంశం అయింది. విధులకు రాకుండానే హాజరు నమోదు చేయడం, సంతకాలు చేసి ఆస్పత్రి నుంచి వెళ్లిపోవడం, నిబంధనలను ఉల్లంఘిస్తూ వ్యవహరించడం వంటి అంశాలు తనిఖీలో వెలుగులోకి రావడంతో ఆస్పత్రి పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విధులకు డుమ్మా.. హాజరు మాత్రం పూర్తి

తనిఖీ సందర్భంగా హాజరు రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్, కొందరు వైద్యులు విధులకు రాకుండానే ముందుగానే సంతకాలు చేసినట్లు, మరికొందరు హాజరు నమోదు చేసి కొద్దిసేపటికే ఆస్పత్రి నుండి వెళ్ళినట్లు గుర్తించిన కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు, పలువురు వైద్యులకు కలెక్టర్ స్వయంగా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు, ఎవరి అనుమతితో విధులు వదిలి వెళ్లారని ప్రశ్నించినట్లు సమాచారం. సంబంధిత వారిపై షోకాజ్ నోటీసులు జారీ చేసి, క్రమశిక్షణ చర్యలకు ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశించినట్లు తెలిసింది.

తనిఖీలో మరో కీలక అంశం కలెక్టర్ దృష్టికి వచ్చింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ తన సెలవు దరఖాస్తును వైద్య కళాశాల ప్రిన్సిపాల్కు సమర్పించాల్సి ఉండగా, ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ సిబ్బందికి ఇచ్చినట్లు గుర్తించారు. అధికారిక విధానాలను పక్కనబెట్టి ఇలా వ్యవహరించడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఆస్పత్రి పరిపాలనా వ్యవస్థలో ఉన్న లోపాలకు అద్దం పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నో ఆరోపణలు... మందులు ఉన్నా బయటివే సూచిస్తున్నారా..?

జిల్లా ఆస్పత్రిపై గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చాయి. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులకు అవసరమైన చికిత్స అందించకుండా ఇతర ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారనే విమర్శలు తరచూ వినిపించాయి. దీనివల్ల ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు అప్పులు చేసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు బాధితులు చెబుతున్నారు.

ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న మందులను ఇవ్వకుండా బయట మెడికల్ షాపుల్లో మాత్రమే దొరికే మందులను సూచిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవల ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి వైద్యుడు మందులు రాయగా అందులో ఒక్క సిరప్ ఆసుపత్రి ఫార్మసీలో లేకపోవడంతో చర్చకు దారితీసింది.ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనరిక్ పేర్లతో మందులు రాయాల్సి ఉండగా, కొందరు వైద్యులు కంపెనీల బ్రాండ్ పేర్లతోనే ప్రిస్క్రిప్షన్లు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీని వల్ల పేద రోగులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ప్రజలు అంటున్నారు.

ప్రశ్నిస్తే ఎదురుదాడి..

వైద్య సేవలపై రోగులు లేదా వారి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన కొందరు వైద్యులు, సిబ్బంది వారిపైనే ఎదురుదాడికి చేస్తున్నారన్న  ఆరోపణలు ఉన్నాయి. వైద్య సేవలపై అడిగిన వారిని బెదిరించడం, నిర్లక్ష్యంగా మాట్లాడటమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు పాల్పడిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయని బాధితులు పేర్కొంటున్నారు.

కలెక్టర్ చర్యలతో మారుతుందా పరిస్థితి..?

జిల్లా ఆస్పత్రిలో కొందరు వైద్యులు విధులకు సక్రమంగా హాజరుకాకుండానే ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల రూపాయల జీతాలు పొందుతున్నారనే ఆరోపణలు గతంలోనూ వెలువడ్డాయి. అయినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కలెక్టర్ తనిఖీలో మరోసారి లోపాలు బయటపడిన నేపథ్యంలో, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని జిల్లా ఆస్పత్రిని గాడిలో పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.