30 July, 2026 | 6:40 PM

ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు

30-07-2026 05:35 PM

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న ఆలయంలో నిర్వహిస్తున్న మూడు రోజుల వరుణ యాగ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు శీఘ్ర దర్శనం, మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఆలయ అభివృద్ధి, విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2023-24లో రూ.50 కోట్లు, 2024-25లో రూ.100 కోట్లు కేటాయించగా, అనంతరం మరో రూ.99.40 కోట్లు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనుల్లో సుమారు 45 శాతం పూర్తయ్యాయని, మరో 10 నుంచి 12 నెలల్లో పూర్తి స్థాయిలో పనులు ముగించి, రాబోయే వెయ్యేళ్ల అవసరాలకు అనుగుణంగా రాజన్న ఆలయాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. భక్తుల సూచనలు, సలహాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.12 కోట్లతో వేములవాడ గుడి చెరువు బండ్ పార్క్ లో ఆధునిక పార్కు, భారీ శివుడి విగ్రహం, మొక్కలు, నటరాజ విగ్రహం పనులు పూర్తి చేసి ప్రారంభించినట్లు తెలిపారు.

అలాగే రూ.10 కోట్లతో బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధి పనులు, రూ.47 కోట్లతో వేములవాడలో 80 అడుగుల రహదారి విస్తరణ పనులు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు.భక్తులకు అన్నదాన సేవలను మరింత విస్తరించేందుకు రూ.35 కోట్లతో అన్నదాన సత్రం నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వేములవాడ డిపోకు 20 కొత్త బస్సులు కేటాయించడం, అలాగే రూ.1.60 కోట్లతో తిప్పాపూర్ బస్టాండ్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయడం ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.