ఉద్యమాలకు వ్యవస్థలు కుదేలు!
డా.తిరునహరి శేషు :
ఏ దేశంలోనైనా, ప్రభుత్వాలు ఏవై నా, పాలకులు ఎవరైనా ప్రజాఉద్యమాలకి తలవంచక తప్పదని చరిత్రలో అనేక చారిత్రక ఘటనలు చెబుతున్నాయి. ఇటీవల గొటబాయోల అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా శ్రీలంకలో ప్రజల తిరుగుబాటుకి, షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న రిజర్వేషన్ల నిర్ణయానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో విద్యార్థుల తిరుగుబాటుకి, నేపాల్ పాలకుల అవినీతి, నెపోటి జం, పాలకుల విలాసవంతమైన జీవితాలు, నిరుద్యోగం లాంటి సమస్యల నియంత్రణలో వైఫల్యంతో కె.పి శర్మ ఓలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెన్- జీ యువత చేసిన తిరుగుబాట్లకు ఆయా దేశాలలోని ప్రభుత్వాలు తలవంచక తప్పలేదు.
భారత్‌లో అత్యంత బలమైన నేతలుగా పేరుగాంచిన నాటి ఇందిరా ప్రభుత్వమైనా, నేటి మోదీ ప్రభుత్వమైనా ప్రజా ఉద్యమాలకు తలొగ్గినవే. 1975లో జయప్రకాష్ నారాయణ నడిపిన సంపూర్ణ స్వరాజ్య విప్లవ ఉద్యమానికి ఇందిరాగాంధీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యార్థి ఉద్యమానికి మోదీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఉద్యమకారులపై కాల్పులు జరిపి, వారి మరణానికి కారణమైన చంద్రబాబు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో విఫలమైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ప్రభుత్వాలనే కోల్పోవాల్సి వచ్చింది.
ప్రపంచంలోనే మోదీ అత్యంత ప్రజాదరణ, ప్రభావితమైన వ్యక్తి అని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ప్రకటించింది. అంతటి ప్రభావవంతమైన వ్యక్తి కూడా విద్యార్థి ఉద్యమానికి దిగివచ్చి వారి డిమాండ్లకు సానుకూలంగా స్పందించక తప్పలేదు. అంటే ప్రజాస్వామిక వ్యవస్థలలో ప్రజా ఉద్యమాలకు ఎంతటి బలం ఉంటుం దో అర్థం చేసుకోవచ్చు.
మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఈ 12 ఏళ్లలో రైతులు, విద్యార్థుల నుంచి రెండు బలమైన ఉద్యమాలను ఎదుర్కొని రెండింటికీ తలవంచా ల్సి వచ్చింది. 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ సాగు చట్టాలకి వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున ఉద్యమించారు.
రైతు ఉద్యమ సమయంలో ఉత్తరప్రదేశ్ లకింపూర్ ఖేరిలో ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి కుమారుడి కాన్వాయ్ దూసుకెళ్లటంతో నలుగురు రైతు లు, ఒక జర్నలిస్టు మరణించారు. మొత్తాని కి దాదాపు 750 మంది రైతులు ఉద్యమ సమయంలో మరణించారు. దీంతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం సాగు చుట్టాలని వెనుకకు తీసుకోవటమే కాదు, రైతులకి ప్రధాని మోదీ క్షమాపణలు కూడా చెప్పారు.
నీట్ లీక్‌పై జెన్‌జీ పోరు..
నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్‌కి వ్యతిరేకంగా అభిజిత్ దీప్కే నేతృత్వంలో విద్యార్థులు చేపట్టిన ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభంలో తేలికగా తీసుకున్నది. దీంతో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసిన విద్యార్థులు జూలై 20న పార్లమెంట్ ముట్టడికి పిలుపిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థి ఉద్యమకారులపై ఢిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ విచక్షణ రహితంగా లాఠీచార్జి చేయడం, భాష్పవాయువు ప్రయోగించటం, పెల్లెట్ గన్స్ ఉపయోగించటంతో వందలాది మంది విద్యార్థులు గాయపడ్డారు.
అయినా జంతర్ మంతర్ వద్ద దీక్షలను కొనసాగించటం, మరొకవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ఉద్యమానికి మద్దతుగా నిలవడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. విద్యార్థి ఉద్యమానికి తలవంచిన ప్రభుత్వం ఉద్యమకారుల ప్రధాన డిమాండ్లకు అంగీకారం తెలుపుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించింది.
భవిష్యత్తులో ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టటానికి సవరణ బిల్లుని పార్లమెంటు ఆమోదించటం, పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావడానికి నందన్ నీలేకని నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో హైపవర్డ్ టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా నియమించటం విద్యార్థులు సాధించిన విజయంగానే భావించాలి.
ముందు జాగ్రత్తగా నోటిఫికేషన్
తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పట్ల ప్రభుత్వాల వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని తమ గళం విప్పుతున్నారు. 2018 నుంచి తెలంగాణలో కొలువుల కొట్లాట పేరుతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా ఉద్యోగాల భర్తీ విషయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చడం విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పెద్దగా స్పందించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా శాసనసభ ఎన్నికల సందర్భంగా ఉద్యోగాల భర్తీ విషయంలో చాలా హామీలు ఇచ్చింది.
ఢిల్లీలో జరిగిన విద్యార్థి ఉద్యమ స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాలలో కూడా విద్యార్థులు ఉద్యమ బాటపడతారనే సమాచారంతోనే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయటానికి సిద్ధపడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో 7,437 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నాలుగు దశలలో 10,060 ఉద్యోగా లు భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖలో 19 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, కేవలం 7437 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వటంతో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు, విద్యార్థులకు, యువతకు అనేక హామీలు ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని నిరుద్యోగ యువత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. ఇటీవల ప్రధాన ప్రతిపక్ష పార్టీ నిర్వహించిన యువ సంగ్రామ సదస్సు వేదిక నుంచి నిరుద్యోగ యువత ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వ వైఖరిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు.
మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీ ఏడబోయింది? రూ.4,000 నిరుద్యోగ భృతి ఎక్కడికి పోయింది? నిరుద్యోగ యువతకి రాజీవ్ యువ వికాసం పథకం కింద ఆర్థిక సహాయం ఏమైంది? బీసీ విద్యార్థులకు ఆంక్షలు లేకుం డా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామనే హామీని ఎందుకు అటకెక్కించారు? అని యువత లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేని అచేతన స్థితిలో ఉంది.
నోటిఫికేషన్ విడుదలలో ఇదే విధమైన జాప్యం జరిగితే తెలంగాణ రాష్ట్రంలో కూడా మరొక కాక్రోచ్ తిరుగుబాటు రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి డైవర్ష న్ పాలిటిక్స్‌లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలో పోటీ చేయటానికి కనిష్ట వయోపరిమితిని 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకి తగ్గించాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారనే వాదన రాజకీ య వర్గాలలో వినిపిస్తున్నది.
ఉద్యోగాల గురించి యువత అడుగుతుంటే రాజకీయాలను ముఖ్యమంత్రి ఎందుకు తెరపైకి తెస్తున్నారని యువత ప్రశ్నిస్తుంది. 25 సంవత్సరాల వయసు ఉన్న యువతకి రాజకీయ అవకాశాలు ఇవ్వని పార్టీలు, కేవలం యువతని, వారి ఆందోళనలను పక్కదారి పట్టించడానికి 21 సంవత్సరాల ప్రతిపాదనని తెరపైకి తెస్తున్నారని యువత భావిస్తున్నది. ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు నైపుణ్యాలు లేవని వారిని క్రిమినల్ వేస్ట్ అంటున్నారు.
కానీ, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేని ప్రభుత్వాల అసమర్థత వారిని నేషనల్ వేస్ట్‌గా మారుస్తుందనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించలేకపోతున్నాయి. విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం జెన్ జీ యువత చేసిన ఉద్యమ స్ఫూర్తితో దేశంలోని ప్రభుత్వ పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు లాంటి మౌలిక సదుపాయాల కోసం, టీచర్ల కోసం జెన్ - ఆల్ఫా ఉద్యమా లు కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ తరం యువత, విద్యార్థులు సోషల్ మీడియాతో ప్రభావితమై దారితప్పుతున్నారనే ఆవేదన నుంచి, అవసరమైతే వ్యవస్థలను సంస్కరించటానికి ఉద్యమాలకు కూడా వెనకాడదనే సంకేతాలు కనపడటం ఆహ్వానించదగిన పరిణామమే.
వ్యాసకర్త సెల్: 9885465877






