కుటుంబ కలహాల వల్లేనా?..
కొడుకు, కూతురిని బావిలోకి తోసి తల్లి ఆత్మహత్య!
శంకర్ పల్లి, జూలై 17 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల కేంద్రం పరిధిలో గురువారం అర్ధరాత్రి ఒక ఘోర కలియుగ దారుణం చోటుచేసుకుంది. కన్నబిడ్డలను బావిలోకి తోసి, ఆపై తల్లి కూడా దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రాంతానికి చెందిన సుధాకర్, వసంత (35) దంపతులు ఉపాధి కోసం శంకర్ పల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామానికి వలస వచ్చారు. ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె నవ్య (15) తో పాటు ఒక కుమారుడు ఉన్నాడు.
ఎందుకు ఆత్మహత్య కు పాల్పడింది?...
కుటుంబంలో తలెత్తిన తీవ్ర కలహాల కారణంగా మనస్తాపానికి గురైన వసంత, గురువారం అర్ధరాత్రి సమయంలో తన ఇద్దరు పిల్లలను తీసుకుని స్థానికంగా ఉన్న ఒక బావి వద్దకు వెళ్లింది. మొదట కుమార్తె నవ్యను, ఆ తర్వాత కుమారుడిని బావిలోకి నెట్టేసింది. అనంతరం తను కూడా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.
చెట్టు కొమ్మ పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్న బాలుడు.
తల్లి బావిలోకి తోసేసినప్పటికీ, కుమారుడు సమయస్ఫూర్తితో బావిలో నీటిపైకి వంగి ఉన్న ఒక చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని వేలాడాడు. ప్రాణభయంతో గట్టిగా కేకలు వేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు బాలుడి కేకలు విని వెంటనే స్పందించి, అతడిని క్షేమంగా బయటకు తీసి ప్రాణాలు రక్షించారు.
విషాదంలో మునిగిన గ్రామం....
సమాచారం అందుకున్న గ్రామస్తులు, శంకర్ పల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో మునిగిపోయిన వసంత, నవ్య (15) ల మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ ఘోరానికి దారితీసి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై శంకర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును వేగవంతం చేశారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో కొత్తపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.






