12-07-2024 12:05:00 AM
ప్రధాని మోదీకి ఆర్థిక వేత్తల వినతి
న్యూఢిల్లీ, జూలై 11: త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్లో వృద్ధిని వేగవంతం చేసే, మౌలిక సదుపాయాలు మెరుగుపర్చే చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదికి ఆర్థిక వేత్తలు విజప్తి చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కేంద్ర బడ్జెట్‌పై ప్రముఖ ఆర్థికవేత్తలు వివిధ రంగాల నిపుణుల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకునేందుకు వారితో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ మేరకు మోదీ ఎక్స్‌లో పోస్టు చేస్తూ ప్రముఖ ఎకానమిస్టులతో చర్చించి, వృద్ధిని పెంచడానికి సంబంధించిన వివిధ అంశాలపై వారి అభిప్రాయాల్ని విన్నానని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న లోకసభకు బడ్జెట్ సమర్పిస్తారు.
సమావేశంలో పాల్గొన్నవారిలో నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బెరి, ఇతర సభ్యులు, ఆర్థిక మంత్రి సీతారామన్, ప్రణాళికా మంత్రి రావు ఇందర్‌జిత్ సింగ్, ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్, ఆర్థిక వేత్తలు సుర్జిత్ భల్లా, అశోక్ గులాటి, ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్‌లు ఉన్నారు. ఇప్పటికే సీతారామన్ ఆర్థిక వేత్తలు, పరిశ్రమ నేతలతో చర్చలు జరిపిన విషయం విదితమే. 2047కల్లా భారత్‌ను ధనికదేశం గా రూపొందించేందుకు తగిన రోడ్‌మ్యాప్‌ను బడ్జెట్లో ప్రతిపాదిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంస్కరణలు వేగవంతం చేసేదిశగా బడ్జెట్లో ప్రభుత్వం చరిత్రాత్మక చర్యల్ని చేపడుతుందంటూ గత నెలలో పార్లమెంటు సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం లో పేర్కొన్న సంగతి తెలిసిందే.