15 March, 2026 | 5:01 AM

మోతకోలు బతుకు!

15-03-2026 01:57 AM

వంగిన నడుము.. పగులుతున్న భుజాలు.. అయినా కనీస భద్రత లేదు 

వ్యవసాయ మార్కెట్ల నుంచి రైల్వే గూడ్స్ షెడ్ల వరకు.. ఎటు చూసినా హమాలీల అరిగోసే

పదిలక్షల మంది శ్రమజీవులకు సంక్షేమ బోర్డు ఏది? 

ఎన్నికల హామీని విస్మరించిన సర్కారు 

ప్రమాద బీమా లేదు.. పెన్షన్ ఊసే లేదు.. అనారోగ్యం పాలైతే ఆదుకునే నాథుడే లేరు 

హనుమకొండలో నేడు హమాలీల మహాగర్జన

హైదరాబాద్, సిటీ బ్యూరో మార్చి 14 (విజయక్రాంతి): గడ్డకట్టే చలిలోనైనా, మండుటెండలోనైనా జనం ఆకలితీర్చడానికి ధాన్యపు బస్తాలను భుజానమోసేది వారే. సిమెంటు, ఎరువుల బస్తాల దుమ్ములో ఊపిరి బిగబట్టి నిరంతరం శ్రమించేది వారే. వారే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే హమాలి శ్రమజీవులు. అయితే, కోట్లాది టన్నుల భారాన్ని మోసే ఆ భుజాలకు నేడు భరో సా కరువైంది.

అటు యాజమాన్యాల శ్రమదోపిడీ, ఇటు ప్రభుత్వా ల ఉదాసీనత మధ్య నలిగిపోతున్న పది లక్షల మంది హమాలీలు ఇప్పుడు తమ ఉనికి కోసం పోరాటానికి సిద్ధమయ్యారు. తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో తమ హక్కుల కోసం ‘మహాగర్జన’కు సిద్ధమయ్యారు.

గుర్తింపు ఏది..

హమాలీలు అంటే కేవలం మార్కెట్ యార్డుల్లో బస్తాలు మోసేవారే కాదు.. మన దైనందిన జీవితంలో ప్రతి వస్తువు రవాణా వెనుక వారి కష్టం దాగిఉంది. రాష్ట్రవ్యాప్తంగా హమాలీలు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో, రైతులు పండించిన పంటను లారీల్లోంచి దించడం, మళ్లీ లోడింగ్‌లో చేయడం వంటి పనుల్లో ప్రధానంగా కనిపిస్తారు. ఒక్కో బస్తా 50 నుంచి 100 కిలోల బరువు ఉన్నా, రోజుకు వందలాది బస్తాలను వీపుపై మోస్తారు.

ఎక్కడచూసినా వారే.. 

* రైల్వే గూడ్స్ షెడ్లు.. బొగ్గు, ఎరువులు, సిమెంటు వంటివి రైలు వ్యాగన్ల నుంచి అన్లోడ్ చేసే సమయంలో వచ్చే దుమ్ము వల్ల వీరు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు.

* సివిల్ సప్లైస్ గోదాములు.. రేషన్ బియ్యం బస్తాలను భారీ ఎత్తున పేర్చడం, లారీలకు ఎక్కించడం వంటి పనుల్లో రాత్రింబవళ్లు శ్రమిస్తారు.

* ట్రాన్స్పోర్ట్ ,లాజిస్టిక్స్.. నగరాల్లోని వివిధ ట్రాన్స్పోర్ట్ ఆఫీసుల్లో యంత్రాల భాగాలు, నిత్యావసర వస్తువులను లోడ్ చేస్తూ పట్టణ రవాణాను సజీవంగా ఉంచుతున్నారు.

* ప్రైవేట్ కంపెనీలు , రైస్ మిల్లులు.. వేలాది రైస్ మిల్లుల్లో వడ్ల బస్తాలను మోస్తూ, ఎగుమతులకు సహకరిస్తూ ఆర్థిక చక్రం తిప్పుతున్నారు.

శారీరక శ్రమ.. ఆరోగ్య వినాశనం..

నిరంతరం బరువులు మోయడం వల్ల హమాలీలలో 35 ఏళ్లకే నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, వెన్నెముక సమస్యలు మొదలవుతున్నాయి. సిమెంటు, ఎరువుల ఘాటు వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. సరైన వైద్య సదుపాయం లేక, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు అందక సంపాదించిన కూలీ అంతా ఆసుపత్రులకే పోయాల్సివస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హమాలీలు ఏకం కావాలి..

రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి హమాలీలు, కార్మిక సంఘాల నేతలు హనుమ కొండకు తరలివచ్చేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. బోయినపల్లి మార్కెట్ అధ్యక్షులు ఉగ్రం యాదవ్, సంఘం సలహాదారులు ఆవాల హరిబాబు ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ప్రచారం సాగుతోంది. భారం మోసే భుజాలు నేడు పిడికిలి బిగించాయి.. మరి పాలకుల కళ్లు తెరుచుకుంటాయో లేదో వేచి చూడాలి.

ప్రధాన డిమాండ్లు..

* హమాలీ వెల్ఫేర్ బోర్డు వెంటనే ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలి.

* ప్రతి కార్మికుడికి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా వర్తింపజేయాలి.

* నివాస హక్కు.. ఇళ్లు లేని హమాలీలందరికీ ఇందిరమ్మ ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు కేటాయించాలి.

* హమాలీల పిల్లలకు ఉన్నత చదువుల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు అందించాలి.

పన్నులు కడుతున్నాం.. 

మేం ప్రభుత్వానికి పన్నులు క డుతున్నాం, ఓట్లు వేస్తున్నాం.. కానీ మాకు దక్కిన ప్రతిఫలం ఏంటి.. ఎన్ని కల ముందు కాం గ్రెస్ నాయకులు హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని మమ్మల్ని నమ్మించారు. అధికారంలోకి వచ్చాక ఆ మాట మర్చిపోయారు. పది లక్షల మంది హమాలీల ఆవేశం ఏంటో హనుమకొండలో చూపి స్తాం. మాకు బోర్డు ఇచ్చి, ప్రతి హమాలీకి గుర్తింపు కార్డు ఇచ్చే వరకు సభలు, ధర్నాలు ఆపబోం. ప్రభుత్వం మా సహనాన్ని పరీక్షించవద్దు.

 శివన్న, వర్కింగ్ ప్రెసిడెంట్, 

తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్

డిమాండ్ల సాధనకే..

రైల్వే గూడ్స్ షె డ్ల దగ్గర పనిచేసే హమాలీల పరిస్థితి వర్ణనాతీతం. అక్కడ కనీసం తాగునీరు, విశ్రాంతి గదులు ఉండవు. లోడింగ్ సమయంలో ఎవరైనా హమాలీ చనిపోతే, ఆ శవాన్ని ఊరికి తీసుకెళ్లడానికి కూడా దిక్కులేని పరిస్థితి. యా జమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. చనిపోయిన హమాలీ కుటుం బానికి రూ. 10 లక్షల పరిహారం అందాలి. వృద్ధాప్యంలో బరువు మోయలేక ఇంట్లో కూర్చున్న హమాలీకి నెలకు రూ. 5,000 పెన్షన్ ఇవ్వాలి. ఈ డిమాండ్ల సాధనకే మా ఈ మహా గర్జన.

 రవికుమార్, అధ్యక్షులు, 

మూసాపేట రైల్వే గూడ్స్ షెడ్

శ్రమదోపిడీ..

హమాలీల కష్టం లేనిదే అటు పరిశ్రమలు నడవవు.. ఇటు ప్రజల కు ఆహారం దొరకదు. కానీ మా బ తుకులు మాత్రం బజారున పడ్డాయి. మా ర్కెట్ యార్డుల్లో దళారులు, కాంట్రాక్టర్లు హమాలీల కూలీలో కోత విధిస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నారు. మాకు కనీస వేత నం గ్యారెంటీ ఉండాలి. వెల్ఫేర్ బోర్డు ద్వారా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ఈ పోరాటం కేవలం మా కోసం కాదు, మా పి ల్లల భవిష్యత్తు కోసం. అందుకే ప్రతి హ మాలీ ఈ మహా గర్జనకు తరలిరావాలి.

 ఎంఏ కలీం, గౌరవ అధ్యక్షులు,

తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్