కొండగట్టును అభివృద్ధి చేస్తాం
- నిధులిచ్చింది ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వమే
- విస్మరించిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్
- కేంద్రమంత్రి బండి సంజయ్
- కరీంనగర్ నుంచి కొండగట్టుకు పాదయాత్ర
- బీజేపీ ప్రతినిధులతో అంజన్న ఆశీర్వాద యాత్ర
కరీంనగర్, మార్చి 14 (విజయ క్రాంతి): కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా మని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం ఉదయం కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం నుంచి 40 కిలోమీటర్ల మేర అంజన్న ఆశీర్వాద యాత్ర చేపట్టారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ యాత్ర మండుటెండను లెక్క చేయకుండా బండి సంజయ్‌తోపాటు నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కార్యకర్తలు కదం కదం కలిపారు.
రేకుర్తి, కొత్తపల్లి మీదుగా వెదిర, గం గాధర చేరుకున్న అనంతరం లంచ్ బ్రేక్ ముగించుకుని తిరిగి పూడురు మీదుగా కొండగట్టు వరకు పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రలో రామడుగు సమీపంలో డ్రోన్ కెమెరాలు తేనె తుట్టెను ఢీకొనడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొన్నా యాత్ర ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగింది.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడు తూ.. స్థానిక ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన బీజీ పీ ప్రతినిధులతో కలిసి కొండగట్టు అంజన్న ఆల యం వద్దకు వస్తానని మొక్కుకున్నానని, ఆ మొక్కు ప్రకారం తాను నిత్యం కొలిచే మహాశక్తి అమ్మవారి ఆలయం నుంచి ఈ ఆధ్యాత్మిక యాత్ర చేపట్టి విజయవంతం చేశామన్నారు. సమాజానికి మంచి చేయాలని తమను గెలిపించిన ప్రజల అభ్యున్నతికి పాటుపడాలనే అంజన్న ఆలయం వద్దకు పాదయాత్ర చేశామన్నారు.
ప్రధాని మోదీ స్ఫూర్తి, నితిన్ నబిన్ ఆశీర్వాదం, రాంచందర్‌రావు నాయకత్వంలో పాదయాత్ర చేపట్టామన్నారు. కొండగట్టు అభివృద్ధికి నిధులు ఇచ్చింది ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వమేన ని, ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం వల్లే నిధులు తెచ్చుకోగలిగామని చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే టీటీడీ తరహాలో కొండగట్టును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. భక్తుల కోసం భారీ అన్నదాన భవనం నిర్మిస్తామని, వేలాది మంది భక్తులకు సరిపడే కాటేజీలు, గెస్ట్ హౌజ్‌లు నిర్మిస్తామని చెప్పారు.
హనుమాన్ దీక్షా విరమణ సమయంలో వేలాదిమంది భక్తులకు సరిపడా అతి పెద్ద దీక్షా విరమణ మండపం నిర్మిస్తామన్నారు. కొండగట్టు, వేములవాడ, ఇల్లందకుంట ఆలయాలను టెంపుల్ కా రిడార్ చేసేందుకు ప్రయత్నించాన ని, ప్రతిపాదనలు పంపాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని వేడుకున్నానని, కనీసం ప్రతిపాదనలు పంప లేదని గుర్తుచేశారు. ప్రతిపాదనలు పంపి ఉంటే ప్రసాదం స్కీం కింద నిధులు తెచ్చేవాడినన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దేవాలయాల అభివృద్ధిపై చిన్నచూపు చూస్తుందని, ఈ పార్టీకీ రాబోయే జీహెఎంసీ ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు.
సీఎం బాటలోనే మందుల సామెల్
కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ హిం దువులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు దారుణమని బండి సంజయ్ అన్నారు. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల బాటలోనే వాళ్లు నడుస్తున్నారని పేర్కొన్నారు.
రెడ్డి, రావు ఎవరైనా సరే మా కాళ్లకింద పడి ఉండాల్సిందేనని ఓవైసీ కించపరిచినా పట్టించుకోలేదని ధ్వజ మెత్తారు. మందుల సామెల్‌ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని, ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తిలో ఎట్లా గెలుస్తాడో చూద్దామని సవాల్ విసిరారు.




