28 July, 2026 | 11:06 PM

మృతులు 670 మందికి పైనే..

27-05-2024 12:53 AM

పపువా న్యూగినియాలో కొండచరియల ఘటన

మృతుల సంఖ్యను అంచనా వేసిన ఐరాస

న్యూఢిల్లీ, మే 26: పపువా న్యూగినియా దేశంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 670 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 150 ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొంది. అలాగే వందలాది మంది శిథిలాల కిందే సమాధి అయ్యారని వెల్లడించింది. పపువా న్యూగినియా రాజ ధాని పోర్ట్ మోర్సీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంగా ప్రావి న్స్‌లో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం గ్రామస్తులు, అధికారులు వెంటనే సహా యక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనలో 100 మందికి పైగా మర ణించారని, 60 ఇళ్లు ధ్వంసమయ్యాయని స్థానిక అధికారులు శుక్రవారం తెలిపారు. అయితే ఆదివారం నాటికి 5 మృతదేహాలను మాత్రమే అధికారులు వెలికితీశారు. తాజాగా మృతు ల సంఖ్యను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వలసల సంస్థ ఏజెన్సీ మిషన్ చీఫ్ సెర్హాన్ అక్టోప్రాక్ వెల్లడించారు. ఈ ఘటనలో 670 మం దికిపైగా మరణించి ఉంటారని, చాలా మృతదేహాలు శిథిలాల కిందే ఉండిపోయాయని తెలిపారు. కాగా, ఒకవైపు మరిన్ని కొండచరియలు విరిగిపడే ముప్పు పొంచి ఉండడం.. మరోవైపు ప్రావిన్స్ రాజధాని వాబాగ్ నుంచి ఘటనా స్థలానికి చేరుకునే మార్గంలో స్థానిక తెగల ఘర్షణల కారణంగా బాధితులకు సహాయక సామగ్రి చేరవేయడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయని స్థానిక అధికారులు తెలిపారు.