తక్కువ వర్షాలతో.. ఆరుతడి పంటలే మేలు
వానాకాలంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన
అచ్చంపేట జూలై 27: వానాకాలంలో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను ఎంపిక చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి కె. కృష్ణయ్య సూచించారు. అచ్చంపేట వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పులిజాల రైతువేదికలో నిర్వహించిన విత్తన మేళాలో రైతులకు పంటల ఎంపిక, సాగు విధానాలపై అవగాహన కల్పించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ వానాకాలంలో నీటి లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచించారు.
కందులు, జొన్నలు, మినుములు, పెసర్లు, సజ్జలు, ఉలవలు, అముదాలు, బొబ్బర్లు, కుసుమలు తదితర పంటలతో పాటు కూరగాయల సాగును కూడా రైతులు చేపట్టాలని తెలిపారు. తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంచుకోవడం ద్వారా వర్షాభావ పరిస్థితుల్లో పంట నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు. విత్తన మేళాకు ఉమామహేశ్వర ఆలయం చైర్మన్ మాధవరెడ్డి, గ్రామ సర్పంచి ఇమ్మడి వెంకటయ్య, ఉప సర్పంచ్ ఆవుల రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రైతులకు అందుబాటులో ఉన్న విత్తనాలు, పంటల ఎంపిక తదితర అంశాలను అధికారులు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) చందన, మౌనిక, విజయ్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.






