సోయి లేకనే తెలంగాణ ఆగం
పదేండ్లు ఎంతో పద్ధతిగా ప్రగతి దారి పట్టించాం
కాంగ్రెస్ రాగానే మళ్లీ ఆగమైన తెలంగాణ: కేసీఆర్
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకుల స్వార్ధంతోపాటు తెలంగాణ ప్రాంత నాయకుల సోయిలేని తనంతో నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు తీరని అన్యాయం జరి గిందని బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. విద్యుత్, వ్యవసాయ రంగాల్లో ఉద్దేశపూర్వక ద్రోహాలను పసిగట్టడంలో నాటి తెలంగాణ నాయకత్వ విఫ లమైందని విమర్శించారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న గురువారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కవులు, కళాకారులు, మేధావులు తమ రచనలు, కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చారని చెప్పారు. మరోవైపు టీఆర్‌ఎస్ రాజకీయ పోరాటంతో స్వ రాష్ట్రం సాకారమైందని పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధన తరువాత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టాలను సరిదిద్దుకుంటూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపామని చెప్పారు. నిన్నటివరకు ఎంతో గొప్పగా సాగిన ప్రగతి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆగమైందని విమర్శించారు.






