15 July, 2026 | 2:19 AM

ప్రాణాలు తీస్తున్న గాలి

05-07-2024 01:31 AM
  • వాయు కాలుష్యంతోనే 7 శాతం మరణాలు 
  • ఢిల్లీలో ఇది మరీ ఎక్కువ 
  • రాజధానిలో ఏటా 12 వేల మంది బలి 
  • ప్రధాన 10 నగరాల్లోనూ ఇదే పరిస్థితి 
  • తాజా అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 4: దేశంలో కొన్నేళ్లుగా కాలుష్యమంటే మొదట గుర్తుకు వచ్చే నగరం రాజధాని ఢిల్లీ. వాయు కాలుష్యంతో పాటు వాతావరణ పరిస్థితులు కూడా ఢిల్లీని ఈ స్థానంలో నిలబెట్టాయి. రాజధాని నగరంలో కాలుష్య పరిస్థితులు శీతకాలంలో మ రింత భయంకరంగా ఉంటాయి. ఢిల్లీ ఒక్కటే కాదు, దేశంలో మొదటి, ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ భారీగా కాలుష్యం కోరలు చా స్తోంది. ఈ పరిస్థితులు మరణాలకు కూడా దారి తీస్తున్నాయి. దేశంలోని 10 ప్రధాన నగరాల్లో సంభవిస్తున్న రోజువారీ మరణాల్లో 7 శాతం కాలుష్యమే కారణమని తా జా అధ్యయనం వెల్లడించింది.

ప్రపంచ ఆరో గ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచించిన పీఎం 2.5 స్థాయిలను మించిన కాలుష్యం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నట్లు ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అనే జర్నల్ ప్రచురించిన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, పుణే, సిమ్లా, వారణాసి వంటి నగరాలను డాటాను ఈ అధ్యయనం విశ్లేషించింది. పీఎం 2.5 స్థాయి పరిమితులు దాటితే చిన్న చిన్న కాలుష్య కారకాలు ఊపిరితిత్తులు, రక్తప్రవాహంలోకి లోతుగా చొ చ్చుకుపోతాయని పేర్కొంది. 

ఢిల్లీలోనే అధికం

పొల్యూషన్‌లో 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసం కలిగిన రేణువులను కలిగి ఉండే పీఎం 2.5 వాయు కాలు ష్యం కారణంగా రోజువారీ, వార్షిక మరణాల్లో ఢిల్లీదే అగ్రస్థానమని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ హానికారక కణాలు ప్రధానంగా వాహన, పారిశ్రామిక ఉద్గాగారాల నుంచి ఉత్పన్నమవుతాయి. ఏటా ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా దాదాపు 12 వేల మంది బలవుతున్నారు. ఇది మొత్తం మరణాల్లో 11.5 శాతం కావడం గమనార్హం.

దేశంలో ఇతర నగరాల్లోనూ రోజూ పీఎం 2.5 కాలుష్యం వల్ల  మరణాలు పెరుగుతున్నాయని పరిశోధకులు తెలిపారు. పీఎం 2.5 స్థాయిలో 10 మైక్రోగామ్ రేణువుల గాఢత పెరుగుతోందనే కొత్త విషయాన్ని ఈ అధ్యయనం గుర్తించింది. రెండు రోజుల వ్యవధిలో దీని ప్రభావం వల్ల రోజువారీ మరణాల్లో 1.4 శాతం పెరుగుదల నమోదైనట్లు వివరించింది. డబ్ల్యూహెచ్‌ఓ ప్రమా ణాల స్థాయికి వాయు కాలుష్యాన్ని తగ్గించకపోతే ఇది 2.7 శాతానికి పెరిగే అవకాశ ముందని హెచ్చరించింది.

స్థానిక కారకాలతోనే మరణాలు

డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సుల ప్రకారం 24 గంటల్లో 15 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీట ర్ (ఎంజీ/సీసీ) ఎక్స్‌పోజర్‌కు వరకే పరిమితి ఇచ్చింది. అంటే అంతకుమించి కాలుష్యానికి గురైతే ప్రమాదమని ఆరోగ్య సంస్థ ఎప్పుడో స్పష్టం చేసింది. కానీ భారత నగరాల్లో ఇది 60 ఎంజీ/సీసీగా ఉంది. నగరాల్లోని నిర్ధిష్ట డాటా ప్రకారం ఢిల్లీలో పీఎం 2.5లో 10 ఎంజీ/సీసీ చొప్పున రోజువారీ మరణాలలో 0.31 శాతం పెరుగుదల నమోద వుతోంది.

బెంగళూరులో ఇది 3.06 శాతం గా ఉంది. సాధారణంగా పీఎం 2.5 కాలుష్యానికి బాహ్య, స్థానిక కారణం కావచ్చు. కానీ, మరణాల రేటు పెరుగుదలకు మాత్రం స్థానిక కాలుష్య కారకాలే ప్రధాన కారణమని అధ్యయనం వెల్లడించింది. మొత్తంగా చూస్తే కాలుష్య స్థాయి తక్కువగా ఉన్న బెంగళూరు, చెన్నై, సిమ్లా వంటి నగరాల్లోనూ లోకల్ పొల్యూషన్‌తో మరణాలు పెరుగుతున్నట్లు అధ్యయనం హైలైట్ చేసింది. 

భారత్ చర్యలు చేపట్టాలి

ఈ అధ్యయనాన్ని చేపట్టిన అంతర్జాతీయ బృందంలో బెనారస్ హిం దూ విశ్వవిద్యాలయం, సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్ పరిశోధకులు పాలుపంచుకున్నారు. 2008 నుంచి 2019 వరకు పది భారతీయ నగరాల్లో దాదాపు 36 లక్షల రోజువారీ మరణాలను ఈ పరిశోధనలో విశ్లేషించారు. కాలుష్య నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమర్థమైన పద్ధతులు వాడుకలో ఉన్నాయని, భారత్‌లో తక్షణమే అమలు చేయాల్సిన అవసరముందని హార్వర్డ్ యూ నివర్సిటీ శాస్త్రవేత్త, అధ్యయన సహ రచయిత జోయేల్ స్కార్ట్ సూచించారు. డబ్ల్యూహెచ్‌ఓ సూచించిన పరిమితులను దాటకుండా చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పారు. లేదం టే గుండె, ఊపిరితిత్తుల జబ్బులు, క్యాన్సర్‌తోపాటు ఇతర శ్వాసకోశ వ్యాధులకు కాలుష్యం కారణమవుతుందని హెచ్చరించారు.