ఉద్యాన శక్తి కేంద్రంగా తెలంగాణ
- 12.94 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
- ఆవిష్కరణలు, అభివృద్ధికి విద్యార్థులు రాయబారులుగా ఉండాలి
- ఉద్యాన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
హైదరాబాద్, జులై 1 (విజయక్రాంతి): ఉద్యాన శక్తి కేంద్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. జ్ఞానం, ఆవిష్కరణలు, స్థిరమైన అభివృద్ధికి రాయబారులుగా విద్యార్థులు ఉండాలని గవర్నర్ పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్‌లో మంగళవారం జరిగిన శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నాల్గవ స్నాతకోత్సవానికి గవర్నర్ హాజరై మాట్లాడారు.
భారతదేశం మరింత స్థిరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని పీఎం మోదీ చెప్పారని గుర్తు చేశారు. 353 మిలియన్ టన్నులకు పైగా ఉద్యాన ఉత్పత్తులతో భారతదేశం దిక్సూచిగా నిలిచిందన్నారు. పండ్లు, కూరగాయ లలో రెండవ స్థానంలో, ఉల్లిపాయలు, అల్లం, బెండకాయల ఉత్పత్తిలో ఇండియాది అగ్రస్థానమని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 12.94 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని, 61.64 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో 34 శాతం వాటాను కలిగి ఉందన్నారు. ఇది కేవలం వ్యవసాయ విస్తీర్ణంలో 7 శాతం మాత్రమేనని అన్నారు.
తెలంగాణ మిరప ఉత్పత్తిలో రెండవ స్థానంలో, పసుపులో మూడవ స్థానంలో ఉందన్నారు. మామిడి పండ్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న కొండపర్తి అనే గిరిజన గ్రామాన్ని రాజ్‌భవన్ దత్తత తీసుకున్నదని, ఆ రైతులకు సహాయం చేయడానికి విశ్వవిద్యాలయం ఆఫ్ క్యాంపస్ శిక్షణా కార్యక్ర మంలో పాల్గొని సాంకేతిక సహాయాన్ని అందించాలని గవర్నర్ కోరారు.
అమెరికాలోని అలబామాలోని ఆబర్న్ విశ్వవిద్యాల యంలో ఎం.ఎస్. ప్రోగ్రామ్‌లను అభ్యసించడానికి ఓవర్సీస్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన విశ్వవిద్యాలయాన్ని, ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశంసించారు. ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ మాట్లాడుతూ ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2027 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుం దన్నారు.
కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్డాస్ జనయ్య, వెటర్నరీ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ జ్ఞాన ప్రకాశ్, డైరెక్టర్ డాక్టర్ ఆర్‌కె మాథ్యు, వర్సిటీ అధికారులు భగవాన్, చీనా, సురేశ్, శ్రీనివాసన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.




