2 June, 2026 | 4:01 PM

డీసీసీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

02-06-2026 03:05 PM

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల దీర్ఘకాల పోరాట ఫలితంగానే రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ఫలితంగా ఏర్పడిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సుగుణక్క పిలుపునిచ్చారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా సమగ్ర అభివృద్ధి సాధించడమే వారికి నిజమైన నివాళి అని అన్నారు.