19 May, 2026 | 7:07 AM

కర్ణాటక వాల్మీకి స్కామ్‌లో తెలంగాణ నేతల హస్తం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

25-08-2024 02:00 AM

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): కర్ణాటక సర్కార్‌ను కుదిపేస్తోన్న వాల్మీకి స్కామ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల హస్తం కూడా ఉందనే ప్రచారం జరుగుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని, వారిని ఎవరు కాపాడుతున్నారో ప్రభుత్వం బయటపెట్టాలని నిలదీశారు. ఈ మేరకు శనివారం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ వాల్మీకి కుంభకోణం వ్యవహారంలో తలెత్తుతున్న ప్రశ్నలకు కాంగ్రెస్ అగ్రనేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ నుంచి రూ. 45 కోట్లు హైదరాబాద్‌లోని 9 బ్యాంకు ఖతాలకు బదిలీ చేశారని ఆ బ్యాంక్ ఖాతాలు ఎవరో తేల్చన్నారు.

ఓ చానల్ పేరుతో ఉన్న బిజినెస్ మీద ఆరోపణలు ఉన్నాయని, దాని యజమాని ఎవరు, వారికి రూ. 4.5 కోట్లు ఎవరు బదిలీ చేశారో సమాధానం చెప్పాలన్నారు. వాల్మీకి స్కాంకు సంబంధించి హైదరాబాద్‌లో ఎస్‌ఐటీ, సీఐడి, ఈడీలు దాడులు నిర్వహించిన తరువాత కూడా ఈ బాగోతంపై తెలంగాణలోని మీడియాలో ఎందుకు రాలేదన్నారు. ఈ స్కామ్‌ను ప్రసారం చేయకుండా అడ్డుకున్నదెవరో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కొన్ని బార్లు, బంగారు దుకాణాల నుంచి భారీగా క్యాష్‌ను విత్ డ్రా చేశారన్నారు. వాటిని ఎవరు నడుపుతున్నారు.

కాంగ్రెస్ పార్టీతో వీరికి ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. వాల్మీకి స్కాంలో రూ. 90 కోట్ల అవినీతి జరిగిందని స్వయంగా కర్ణాటక సీఎం సిద్దిరామయ్య అసెంబ్లీలోనే అంగీకరించారని గుర్తు చేశారు. సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా కూలిపోతుందని కర్ణాటక మంత్రి  సతీశ్ జారకిహోళి అన్నారని తెలిపారు. ఆ మాటల అర్థం ఏమిటన్నారు. ఈ స్కాంలో హైదరాబాద్ నేతల పాత్ర కూడా ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆధారాలు కనబడుతున్నప్పటికీ ఈడీ ఎందుకు  మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఇక్కడి కాంగ్రెస్‌ను ఎవరు కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరో గుర్తించాలని పేర్కొన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయంటే ప్రజలకు చెప్పాలని ఆయన  డిమాండ్ చేశారు.