డిసెంబర్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక పాలసీలపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో పెట్టుబడులను భారీగా ఆకర్షించడంతో పాటు లక్షలాది ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఇండస్ట్రియల్ పాలసీ 2.0కు శ్రీకారం చుట్టింది. డిసెంబర్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో కొత్త పాలసీలను ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే లైఫ్ సైన్సెస్ పాలసీ 2.0ను ప్రభుత్వం ప్రకటించింది. మరో తొమ్మిది కీలక పారిశ్రామిక రంగాలకు ప్రత్యేక పాలసీలను రూపొందించే పనిలో ఉంది.
కీలక రంగాలకు ప్రత్యేక పాలసీలు
లాజిస్టిక్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగానికి ప్రత్యేక పాలసీ తీసుకురానుంది. ఫుట్‌వేర్, లెదర్, అప్పెరల్, లైఫ్‌స్టైల్, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCC), డేటా సెంటర్లు, ఆటోమొబైల్ రంగాలకు కూడా ప్రత్యేక పాలసీలను రూపొందిస్తోంది. భారీ, మెగా పరిశ్రమలకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పాలీసెంట్రిక్ ఇండస్ట్రియల్ గ్రోత్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది.
జిల్లాలకూ పారిశ్రామిక వృద్ధి
పారిశ్రామిక అభివృద్ధిని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా జిల్లాలకూ విస్తరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాలను పారిశ్రామిక వృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతోంది. జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు అదనపు ప్రోత్సాహకాలు అందించేలా కొత్త పాలసీల్లో ప్రత్యేక నిబంధనలు తీసుకురానుంది.
సెమీకండక్టర్లు, చిప్ డిజైన్‌పై ఫోకస్
సెమీకండక్టర్లు, చిప్ డిజైన్ రంగాలకు భారీ ప్రోత్సాహకాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న చైనా ప్లస్ వన్ వ్యూహం ద్వారా ఏర్పడుతున్న అవకాశాలను తెలంగాణకు మళ్లించేలా పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక వ్యూహాన్ని రూపొందిస్తోంది.
డేటా సెంటర్లు, ఈవీ రంగాలకు ప్రాధాన్యం
డేటా సెంటర్ల ఏర్పాటుతో వాటికి అనుబంధంగా అభివృద్ధి చెందే ఇతర రంగాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు (EV), బ్యాటరీ తయారీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనుంది.
2030 నాటికి భారీ పెట్టుబడుల లక్ష్యం
కొత్త పారిశ్రామిక పాలసీల ద్వారా రాబోయే ఐదేళ్లలో భారీగా పెట్టుబడులను ఆకర్షించి, పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.






