31 August, 2026 | 12:48 PM

అలంపూర్‌ను జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి

31-08-2026 11:58 AM

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఎమ్మెల్సీ చల్లా, ఎమ్మెల్యే విజయుడు వినతి

అలంపూర్, ఆగస్టు 31: ప్రముఖ ఐదవ శక్తిపీఠంగా ప్రసిద్ధిగాంచిన అలంపూర్‌ను జాతీయ స్థాయి పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. సోమవారం అలంపూర్‌లో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. జోగులాంబ ఆలయాల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ రూపొందించడం, జోగులాంబ హాల్ట్‌లో అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే భారత్‌మాల హైవేపై రాజోలి వద్ద ఎంట్రీ, ఎగ్జిట్‌, జోగులాంబ హాల్ట్‌ వద్ద ఆర్వోబీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలంపూర్‌,రాయచూరు,శ్రీశైలం కారిడార్‌ను నాలుగు లైన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి చేయడంతో పాటు బీచుపల్లి నిజాంకొండను ఎకో టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.