31 August, 2026 | 1:05 PM

మరోసారి మంత్రి సురేఖ ఫోటో అవుట్!

31-08-2026 12:05 PM

అధికారిక కార్యక్రమంలో కనిపించని జిల్లా మంత్రి ఫోటో 

మహబూబాబాద్, (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారిక కార్యక్రమంలో మరోసారి జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ ఫోటో లేకుండా నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో అధికారికంగా నిర్వహిస్తున్న మున్సిపాలిటీ భవన నిర్మాణం, మూడు మండలాల నూతన తాసిల్దార్ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన, విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభం, నారాయణపురం గ్రామ రైతులకు పట్టా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో వేదికపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లాకు చెందిన మరో మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, బీ ఆర్ ఎస్  కు చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు ఫోటోలను ఏర్పాటు చేసి, జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ ఫోటో మాత్రం ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది.

ఇదిలా ఉంటే ఇటీవల ఇదే జిల్లా గూడూరు మండల కేంద్రంలో అధికారికంగా నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కూడా మంత్రి సురేఖ ఫోటో ఏర్పాటు చేయలేదు. ఇటీవల మంత్రి సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డి పట్ల చేసిన వ్యాఖ్యలు దుమారం లేపిన నేపథ్యంలో, రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడంతో అంతా సమసిపోయిందని భావిస్తున్న నేపథ్యంలో, తాజాగా మంత్రి ఫోటో అధికారిక కార్యక్రమంలో  తప్పించడంతో మరోసారి చర్చకు తెర లేపినట్లయ్యింది