సంక్షేమ పథకాలలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం
గృహ నిర్మాణ పథకంలో ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ
జవహర్ నగర్,(విజయక్రాంతి): సంక్షేమ పథకాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని, పేదలకు గృహాలను నిర్మించి ఇవ్వడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి వరుసలో నిలబడడం అభినందనీయమని జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ మదర్ తెరిసా కాలనీ వాస్తవ్యులైన మేడ లతా రాజులకు ఇటీవలే ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా ఇంటి నిర్మాణం చేపట్టగా లతా రాజులు ఇటీవలే ఇల్లు నిర్మించుకొని గృహప్రవేశానికి సిద్ధమయ్యారు.
ఈ మేరకు గృహప్రవేశానికి జవహర్ నగర్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ తదితరులతో మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీ పథకాలలో భాగంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి జవహర్ నగర్ లో పెద్ద ఎత్తున లబ్ధిదారులు ఎంపికవ్వడం ఆనందంగా ఉందన్నారు. పేద ప్రజలకు నిలయమైన జవహర్ నగర్ లో ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడం ముదాబావమన్నారు.
ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఐదు లక్షలు సాయం అందించడంతో పేదల బతుకులు మారిపోతాయనటంలో సందేహం లేదన్నారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, ఇందిరమ్మ కమిటీ ప్రెసిడెంట్ బూడిద వెంకటేష్, హౌసింగ్ ఏఈ శ్రీహరి, భాష పల్లి రమేష్ చారి, యూత్ ప్రెసిడెంట్ మాట్ల వినయ్, రాజు యాదవ్, మేరీ, రవి, భాస్కర్ గౌడ్, కిషోర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.




