రేపటిలోగా చెప్పండి!
సుందిళ్ల నివేదిక కోరిన జస్టిస్ చంద్రఘోష్
ప్రాజెక్టు సందర్శనలో లోపాలపై ఆరా
మంథని, జూన్ 8(విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు లోపాల్లో వాస్తవాలను వెలికితీసేందుకు విచారణ బృందం రంగంలోకి దిగింది. ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిటీని కేంద్ర జల మండలి నియమించింది. ఆ బృందం శనివారం ప్రాజెక్టులో ఒకటైన పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బరాజ్‌ను సందర్శించింది. బరాజ్ పైభాగం నుండి అడుగు భాగం వరకు క్షుణ్ణంగా పరిశీలించింది. ఇరిగేషన్ శాఖ అధికారులతో పలు అంశాలపై ఆరా తీసింది.
బరాజ్ వివరాలతోపాటు గతంలో జరిగిన లోపాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలను సేకరించింది. గతంలో జరిగిన లోపాలపై ప్రశ్నించగా ఇంజినీర్లు నీళ్లు నమలడంపై జస్టిస్ ఘోష్ బృందం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రాజెక్టు వివరాలతో కూడిన నివేదికను సోమవారంలోగా తమకు అందజేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించింది. అనంతరం సుందిళ్లలోని లక్ష్మినరసింహస్వామి ఆలయాన్ని జస్టిస్ ఘోష్ దంపతులు సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.






