15 July, 2026 | 2:16 AM

ఆరోగ్యశ్రీకి 497 కోట్లు

09-06-2024 01:33 AM

అదనంగా 65 కొత్త చికిత్స విధానాలు 

1,375 పాత చికిత్స విధానాలకు నగదు ప్యాకేజీ పెంపు 

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): పేదల వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 497.29 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నాడు ఆరోగ్య శ్రీ కోసం నిధులను విడుదల చేస్తున్నట్లుగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద గతంలో అందుబాటులో లేని యాంజియోగ్రామ్, పార్కిన్‌సన్, వెన్నెముక శస్త్ర చికిత్స వంటి ఖరీదైన వ్యాధులకు చికిత్స అందించడంతో పాటు, ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ పథకంలోని చికిత్సల ప్యాకేజీ ధరలను కూడా  పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి రూ. 497.29 కోట్లు అవసరం కాగా శనివారం ఈ నిధులను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి  విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద కొత్త చికిత్సా విధానాల కొరకు, ప్రస్తుతం ఉన్న చికిత్స విధానాల ఆర్థిక సవరణ కొరకు భట్టితో జూన్ 7న రాష్ర్ట సచివాలయంలో సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. 

ఉచిత వైద్య సేవలకు..

పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ప్రెవేశపెట్టింది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా 2.84 కోట్ల మంది లబ్ధిదారులు వైద్య సేవ లు పొందుతున్నారు. వీరికి రూ. 10 లక్షల వరకు విలువైన వైద్య సేవలు ఉచితంగా లభిస్తాయి. రాష్ర్టం లో ఈ సదుపాయం 1,402 ఆసుపత్రుల ద్వారా అందుతున్నది.

ప్రస్తుతం ఈ పథకంలో 1,672 చికిత్సా విధానాలు అందుబాటులో వున్నాయి. ఇందులో 1,375 విధానాలకు ప్యాకేజీ ధరలు పెంచాలని వైద్య నిపుణుల సూచనల మేరకు శనివారం డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీలో అమలులో లేని యాంజియోగ్రామ్, పార్కిన్‌సన్, వెన్నుపూసకు సంబంధించిన 65 అధునాతన చికిత్స విధానాలను ఇకనుంచి ఆరోగ్యశ్రీలో అమలుచేయాలని నిర్ణయించారు. వీటికి తోడు ప్రస్తుతం ఆయుష్మాన్ 

 భారత్‌లో ఉన్న 98 చికిత్సా విధానాలు రాజీవ్ ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల దాదాపు రూ.189.83 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుంది. 65 కొత్త చికిత్సా విధానాలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రభుత్వంపై రూ. 158.20 కోట్ల భారం పడనుంది. సవరణల వల్ల, కొత్త చికిత్సా విధానాలు చేర్చడం ద్వారా మొత్తంగా ప్రభుత్వంపై రూ. 497.29 కోట్ల భారం పడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అదనంగా 65 చికిత్సలను అందుబాటులోకి తీసుకురావ డంతో పాటుగా పాత చికిత్స విధానాలకు ప్యాకేజీ ధరలు పెంచడం వల్ల వివిధ ప్రైవేటు హాస్పిటల్స్‌లోనూ పేదలకు మెరుగైన వైద్యం అందేందుకు అవకాశం ఏర్పడిందని వైద్య నిపుణులు చెబుతున్నారు.