24 July, 2026 | 4:26 PM

అమెరికాలో తెలుగు నాల్గింతలు!

28-06-2024 01:52 AM
  1. ఎనిమిదేళ్లలో పెరిగిన తెలుగు మాట్లాడే వారి సంఖ్య 
  2. 2016లో 3.2లక్షల మంది, 2024 నాటికి 12.3లక్షల మంది
  3. అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషలో 11వ స్థానంలో తెలుగు

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి) : ఆమెరికాలో తెలుగు మాట్లాడేవారు నానాటికీ పెరుగుతున్నారు. ఆ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషల్లో తెలుగు ఒకటిగా నిలిచింది. యూఎస్‌లో గత ఎనిమిదేళ్లలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య నాలుగింతలు పెరిగినట్లు తాజా అధ్యయనం చెబుతోంది. 2016లో తెలుగు మాట్లాడేవారు 3.2లక్షల మంది ఉంటే, 2024 నాటికి 12.3లక్షల మందికి పెరిగినట్లు అమెరికాకు చెందిన  స్టాటిస్టికల్ అట్లాస్ అనే సర్వే సంస్థ వెల్లడించింది. యూఎస్ సెన్సెస్ బ్యూరో డేటా ఆధారంగా ఈ నివేదికలను రూపొందించినట్లు పేర్కొంది. 

ఏడాదికి 70వేల స్టూడెంట్ వీసాలు..

కొంతకాలంగా అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2010 నుంచి 2017 వరకు తెలుగు మాట్లాడేవారి సంఖ్య దాదాపు 86శాతం మాత్రమే పెరిగింది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ అనే అమెరికన్ సంస్థ వెల్లడించింది. 2017లో తెలుగు మాట్లాడే వారు దాదాపు 4లక్షల మందికి పైగా ఉంటారు. అయితే గత ఎనిమిదేళ్లలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పాలి. ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 60వేల నుంచి 70వేల మంది విద్యార్థులు స్డూడెంట్ వీసాల మీద, దాదాపు 10 వేల మంది హెచ్1బీ వీసాలతో అమెరికాకు వెళ్తుంటారు.

ఇటీవల కాలంలో అమెరికాకు వచ్చే తెలుగు వాళ్లలో దాదాపు 75శాతం మంది డల్లాస్, బే ఏరియా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, అంట్లాంటా, ఫ్లోరిడా, నాష్ విల్లే వంటి ప్రాంతాల్లో ఉంటున్నారని అక్కడున్న తెలుగు అసోషియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. అమెరికాకు కొత్తగా వస్తున్న యువకులు ఎక్కువగా ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో పని చేసేందుకే అమెరికాకు వెళ్తున్నారు. అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో తెలంగాణ, ఏపీ స్టూడెంట్స్ 12.5శాతం ఉన్నట్లు ఇండియన్ మొబిలిటీ రిపోర్టు  చెబుతోంది.

కాలిఫోర్నియాలో అత్యధికంగా

అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉండగా కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీలో తెలుగు మాట్లాడేవారు ఎక్కువ ఉంటారు. యూఎస్‌లో 350భాషలను అక్కడి ప్రజలు మాట్లాడుతుంటారు. అందులో ఎక్కువ మంది మాట్లాడే విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో నిలిచింది. అలాగే, అమెరికాలో భారతీయులు ఎక్కువగా మాట్లాడే మూడో భాష కావడం విశేషం. మొదటి స్థానంలో హిందీ, రెండోస్థానంలో గుజరాతీ ఉండగా.. మూడోస్థానంలో తెలుగు ఉన్నట్లు స్టాటిస్టికల్ అట్లాస్ చెబుతోంది. కాలిఫోర్నియాలో 2లక్షల మంది, టెక్సాస్‌లో 1.50లక్షల మంది,  న్యూజెర్సీలో 1,10,000 మంది ఉన్నారు. అలాగే, ఇల్లినాయస్ 83,000 మంది, వర్జినియాలో 78,000మంది, జార్జియాలో 52,000 మంది ఉన్నట్లు నివేదిక చెబుతోంది.