24 July, 2026 | 5:21 PM

ఎప్పుడిచ్చినా బిల్లు 30 రోజులకే!

28-06-2024 01:51 AM
  1. విద్యుత్ బిల్లుల అపోహలకు చెక్
  2. బిల్లింగ్ ఆలస్యమైనా నెల రోజుల రీడింగుకే లెక్క
  3. స్పాట్ బిల్లింగ్ మిషన్‌లో సాఫ్ట్‌వేర్ సెట్టింగ్ 
  4. ఎస్‌పిడిసిఎల్ వెబ్‌సైట్, యాప్‌లో అందుబాటు 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (విజయక్రాంతి) : విద్యుత్ బిల్లుల స్లాబ్ రేట్, వినియోగించిన యూనిట్లు, బిల్లింగ్ తీసే రోజులకు సంబంధించి సోషల్ మీడియాలో కొనసాగే ప్రచారం మనకు తెల్సిందే. ముప్పు (30) రోజులకే తీయాల్సిన బిల్లింగ్‌ను వినియోగదారుల నుంచి అదనపు ఆదాయం పొందేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే నెల రోజుల తర్వాత బిల్లింగ్ తీస్తున్నారంటూ ఫలితంగా యూనిట్ స్లాబ్ రేటు మారి బిల్లుల మోత మోగుతున్నాయంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది.

ఒకవేళ విద్యుత్ సిబ్బంది బిల్లింగ్ (రీడింగ్) ను 30 రోజుల తర్వాత తీసినా కూడా నెల రోజులకే బిల్లు చెల్లించేలా ఎస్‌పిడిసిఎల్ అధికారులు ఎనర్జీ చార్జ్‌స్ కాలిక్యూలేటర్ ఫర్ డెమోస్టిక్ సర్వీస్ పేరుతో ప్రత్యేక విధానాన్ని రూపొందించారు. విద్యుత్ బిల్లులపై అనుమానం ఉన్న వారు టిజిఎస్‌పిడిసిఎల్ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవడానికి అవకాశాన్ని అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సేవలను వెబ్‌సైట్‌లో అందుబాటులో తీసుకుకొచ్చారు. త్వరలోనే మొబైల్ యాప్‌లో కూడా చెక్ చేసుకోవడానికి వీలుగా తీసుకురానున్నట్టు ఎస్‌పిడి సిఎల్ చెబుతున్నారు. 

స్లాబ్ మారితే పెరుగుతున్న ధరలు

ఉదాహరణకు డొమెస్టిక్ కేటగిరీలో 0 నుంచి 50 యూనిట్లు, 51 నుంచి 100 యూనిట్ల వరకూ యూనిట్ ధరలు వరుసగా రూ.1.95 లు, రూ.3.10 పైసలు ఉన్నా యి. బిల్లింగ్‌లో 100 యూనిట్ల విద్యుత్ వినియోగం దాటితే కేటగిరి 1బి కింద యూనిట్ ధర రూ. 3.40 పైసలు, 101 నుంచి 200 యూనిట్ల వరకూ రూ. 4.80 పైసలు చొప్పు న బిల్లు చెల్లించాల్సి ఉంది. ఈ ప్రకారం గత నెలలో 30వ తేదీన బిల్లింగ్ చేసి.. ప్రస్తుత నెలలో 30వ తేదీ కాకుండా, 1వ తేదీ లేదా 2వ తేదీ రీడింగ్ తీసి బిల్లింగ్ చేసినట్టయితే నెల రోజుల కంటే రెండ్రోజులు అదనంగా వినియోగించిన యూనిట్లు కూడా ఆ బిల్లు లో చేరుతుంది. దీంతో అదనంగా వినియోగించిన రెండ్రోజుల విద్యుత్ కలవడం వలన స్లాబ్ రేటు మారడంతో వినియోగదారులకు బిల్లుల భారం తడిసి మోపడవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆదాయం పెంచుకోవడం కోసమే నెల రోజుల తర్వాత బిల్లింగ్ చేస్తున్నారనే అపవాదు విద్యుత్ శాఖపై ఉంది. 

అపోహలకు చెక్

విద్యుత్ సరఫరా, అంతరాయాలపై ప్రస్తుతం కొనసాగుతున్న పొలిటికల్ కోల్డ్ వార్ (డైలాగ్) వార్ నేపథ్యంలో అధికారుల పట్ల ప్రజలకు విశ్వా సాన్ని కలిగించేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక కార్యచరణకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే అనేక ఏళ్లుగా విద్యుత్ బిల్లింగ్ విషయంలో ఉన్న అపోహలకు చెక్ పెట్టేందుకు ఎనర్జీ చార్జెస్ కాలిక్యూలేటర్ డొమెస్టిక్ సర్వీస్‌ను అందుబాటులో తీసుకొచ్చారు. ఈ విధాన ద్వారా విద్యుత్ శాఖ సిబ్బంది ఏదైనా కారణాల చేత నెల రోజుల తర్వాత రీడింగ్ తీసినా కూడా మనం చెల్లించాల్సిన బిల్లు 30 రోజులు లేదా 31 రోజులకే (యావరేజ్ నెల రోజులకు మాత్రమే) బిల్లు చెల్లించే విధానం తీసుకొచ్చారు.

అందుకు టిజిఎస్‌పిడిసిఎల్ వెబ్‌సైట్ లో ఎనర్జీ చార్జ్‌స్ కాలిక్యూలేటర్ డొమెస్టిక్ సర్వీస్ పేరుతో ఈ విధానాన్ని రూపొందించారు. ఈ విధానం ద్వారా http://tgsouthe rnpower.org ఎస్‌పిడిసిఎల్ వెబ్‌సైట్ లో Energy Charges Calculator for Domestic Service లో ఆప్షన్‌లోకి వెళ్లి గత నెలలో రీడింగ్ డేట్, నమోదైన యూనిట్లు, ప్రస్తుత నెలలో రీడింగ్ తీసిన డేట్, యూనిట్లను ఎంటర్ చేసినట్టయితే మనకు చెల్లించాల్సిన యావరేజ్ (నెల రోజులకే) బిల్లు కన్పిస్తుంది. ఈ బిల్లును మనం చెక్ చేసుకు న్నా.. చేసుకోకున్నా ఆటోమెటిక్‌గా నెల రోజులకే బిల్లింగ్ చెల్లించేలా ఆన్‌లైన్‌లో చూపిస్తుంది. కానీ, అపోహలు ఉన్నవారు ఎస్‌పిడిసిఎల్ వెబ్‌సైట్ కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.