ఆరోగ్యానికి పదివేల అడుగులు
రోజూ వాకింగ్ చేయటం వలన ఎన్నో రకాలుగా శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆలోచనల్లో స్పష్టత, సృజనాత్మకత పెరుగుతాయి. శరీరం, మనసు రెండింటికీ ఒకేసారి ప్రయోజనాన్ని ఇచ్చే వ్యాయామాల్లో వాకింగ్ ప్రధానమైనది. రోజుకు 10,000 అడుగులు వేస్తే.. గుండె జబ్బులు, 13 రకాల క్యాన్సర్లు, డిమెన్షియా ముప్పు తగ్గుతుందని 2022లో నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. 10,000 కంటే తక్కువ అడుగులు నడిచినా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
వ్యాయామం అసలే చేయనివారు, ఏదో ఒక శారీరక కసరత్తు చేయాలనుకునేవారు పరిమిత వేగంతో బ్రిస్క్ వాక్ చేస్తే మంచిదని నిపుణుల సూచన. బ్రిస్క్ వాకింగ్ గుండెకు మేలు చేయడంతోపాటు మన శరీరం మొత్తాన్నీ ఆరోగ్యవంతం చేస్తుంది. జీవితంలో నాణ్యత పెంచుతుంది. నిపుణుల అభిప్రాయంలో నడక అనేది ‘మితమైన వ్యాయామం’. ఒత్తిడి నుంచి బయటపడేస్తుంది. ప్రతికూల ఆలోచనలనుంచి సానుకూల దృక్పథం వైపు నడిపిస్తుంది.
రోజుకు 10,000 అడుగులు వేయడం మంచి ఆరోగ్యానికి కీలకమనే అభిప్రాయం ఉన్నప్పటికీ మీ రోజు వారి దినచర్య ఆధారంగా నడవడం అనేది చాలా ముఖ్యం. మీకు అస్సలు నడక అలవాటు లేకుండా.. ప్రతి రోజూ కూర్చొనే పనిచేస్తూ ఉండే వ్యక్తి అయితే ఒకేసారి 10,000 అడుగులు నడవడం ప్రారంభిస్తే మంచి కన్నా, చెడు అధికంగా జరుగుతుంది. అందుకే దశల వారీగా నడక తీవ్రతను పెంచాలి.






