- సీపీ ఆఫీస్ ముందు బీఆర్‌ఎస్ నేతల ఆందోళన
- ఒక దశలో పోలీసులతో కౌశిక్‌రెడ్డి వాగ్వాదం
- పలువురు బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ పరస్పర సవాళ్లతో గురువారం మధ్యాహ్నం నుంచి సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసినగాంధీ, అతని అనుచరులను అరెస్ట్ చేయాలని సైబరాబాద్ సీపీ కార్యాలయం ముందు మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు నేతలు ఆందోళనకు దిగారు.
అరికెపూడిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దగ్గరుండి దాడిని ప్రోత్సహించిన సీఐ, ఏసీపీలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఎమ్మెల్యే గాంధీతో పాటు, అతని అనుచరులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల నేపథ్యంతో మాజీమంత్రి హరీశ్‌రావుతో పాటు వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌తో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.