రీ పోలింగ్‌లోనూ ఉద్రిక్తతలు
- బెంగాల్‌లోని 15 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్
- ఫాల్తాలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ
- టీఎంసీ నేతలు ఓటర్లను అడ్డుకుంటున్నారని బీజేపీ నేతల ఆరోపణలు
- రోడ్లపైకి వచ్చి నిరసనలు
కోల్‌కతా, మే ౨: పశ్చిమ బెంగాల్‌లోని దక్షి ణ 24 పరగణాల జిల్లా మగ్రాహట్ పశ్చిమ నియోజకవర్గంలో 11 పోలింగ్ కేంద్రాలు, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 పోలింగ్ కేంద్రాల్లో శనివారం తీవ్రమైన ఉద్రిక్తతల నడుమ రీపోలింగ్ జరిగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో గత నెల 29న జరిగిన రెండో (తుది) దశ ఎన్నికల్లో అక్రమాలు, అవకతవకలు జరిగాయని అందిన ఫిర్యాదులు అందాయి.
దీంతో ఎన్నికల సంఘం తిరిగి పోలింగ్ నిర్వహించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. దక్షిణ 24 పరగణాల జిల్లా ఫాల్తాలోని పోలింగ్ కేంద్రాల్లో తమకు అనుకూలమైన ఓటర్లను టీఎంసీ కార్యకర్తలు ఓటువేయకుండా అడ్డుకుంటున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. వందలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. టీఎంసీ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని కొందరు మహిళలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. కేంద్ర బలగాల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఫిర్యాదుల్లో ఏముందంటే..
మగ్రాహట్ పశ్చిమ, డైమండ్ హార్బర్ అసెంబ్లీ నియోజకవర్గాలో కొందరు వ్యక్తులు పోలింగ్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారనేది ఫిర్యాదుల్లో సారాంశం. అలాగే, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈవీఎం యంత్రాలపై కొన్ని పార్టీల గుర్తులకు సంబంధించిన బటన్లను టేపులతో మూసేశారని బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఫాల్తా వంటి ప్రాంతాల్లో ఓటర్లను తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయకుండా అడ్డుకున్నారని, రిగ్గింగ్ జరిగిందని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
మాకు 200 సీట్లు: సీఎం మమత
ఒకవైపు 15 పోలింగ్‌కేంద్రాల్లో రీ పోలింగ్ జరుగుతుండగా, మరో వైపు టీఎంసీ అధినేత్రి, ముఖ్య మంత్రి మమతా బెనర్జీ తన పార్టీ కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా, తమ పార్టీ ఏకంగా 200 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎగ్జిట్ పోల్స్ ఒక బూటమకమని, అవి కొన్ని సంస్థలు పనిగట్టుకుని బీజేపీ అనకూలంగా చేయించిన సర్వేలని కొట్టిపడే శారు. ఆ ఎగ్జిట్ పోల్స్ కేవలం స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే ప్రయత్నాలని అభిప్రాయపడ్డారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. పోలింగ్ సమయంలో కేంద్ర బలగాలు ఓటర్లను బెదిరించాయని ఆమె ఆరోపించారు.






