ఉగ్రవాది అమీర్ హమ్జాపై కాల్పులు
అత్యంత విషమంగా ఆరోగ్యం
హై అలెర్ట్, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం
ఇస్లామాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): లష్కర్ ఏ తోయిబా (ఎల్‌ఈటీ) సహ వ్యవస్థపాకుడు అమీర్ హమ్జాపై గురువారం లాహోర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపా రు. ఓ మీడియా కార్యాలయం బయట ఈ దాడి జరిగింది. ఈ దాడిలో హమ్జా తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
హమ్జాను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హమ్జా అంతర్జాతీయ ఉగ్రవాది. అమెరికా కూడా హమ్జాను ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. హఫీజ్ సయీద్‌తో కలిసి ఎల్‌ఇటీ స్థాపించాడు. భారత్‌లో అనేక దాడులలో హమ్జా ప్రమేయం ఉంది. కాగా ఈ కాల్పులపై లాహోర్ పోలీసులు స్పందించారు.
హమ్దార్ చౌక్ వద్ద ఒక వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని, వాహనంలో ఉన్న ఇతరులు సురక్షితంగా ఉన్నారని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. హమ్జా ఆఫ్గాన్ ముజాహిదీన్ తరఫున పనిచేశాడు. లష్కరే పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరించాడు. నిధుల సేకరణ యువతను ఉగ్రవాదంలోకి చేర్చుకోవడం, తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేసేందుకు పుస్తకాలు కూడా రాశాడు. పాక్ ప్రభుత్వం చర్యల తరువాత హమ్జా ‘జేషే మన్కాఫా’ అనే పేరుతో ఓ సంస్థను నడుపుతున్నాడు. కశ్మీర్‌లో ఉగ్రకార్యకలాపాలకు సంస్థను వినియోగిస్తున్నాడని నిఘావర్గాలు గుర్తించాయి.






