నల్లచట్టం డీలిమిటేషన్
- బీజేపీ గర్వాన్ని అణచేస్తాం
- తమిళనాడు సీఎం స్టాలిన్
- డీలిమిటిషేన్ ముసాయిదా ప్రతి దహనం
- రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలు ఎగురవేత
చెన్నై, ఏప్రిల్ 16: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన పోరాటాన్ని ఉధృతం చేశారు. ‘డీలిమిటేషన్’ బిల్లును నల్లచట్టంగా ఆయన అభివర్ణించారు. గతంలో హిందీ వ్యతిరేక ఉద్యమాలతో ఢిల్లీని గడగడలాడించామని.. ఇప్పు డు కూడా అదే తరహా పోరాటంతో బీజేపీ గర్వాన్ని అణచేస్తామని హెచ్చరించారు.
బిల్లు ముసాయిదా కాపీని ఆయన గురువారం బహిరంగంగా దహనం చేశారు. అనంతరం నల్లజెండా ఎగురవేసి రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ బిల్లు తమిళుల హక్కులపై, సమాఖ్య స్ఫూర్తిపై జరుగుతున్న దాడిగా ఆయన పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్ పై కేంద్రం మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టిన నేపథ్యంలో పార్లమెం టు మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. అయితే త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టాలిన్ గురువారం నామక్కల్ ప్రాం తంలో పర్యటించారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా నల్ల దుస్తులు ధరించి తన నిరసనను తెలిపారు.
నల్ల జెండాను ఎగరవేసి.. బిల్లు ముసాయిదా కాపీని తగలబెట్టారు. అనంతరం ‘కలిసి పోరాడదాం.. గెలుద్దాం’ అంటూ డీఎంకే నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను స్టాలిన్ ఎక్స్‌లో పోస్టు చేశారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆయన ‘నల్ల చట్టం’గా పేర్కొన్నారు. గతంలో హిందీ వ్యతిరేక ఉద్యమాలతో ఢిల్లీని గడగడలాడించా మని.. ఇప్పుడు కూడా అదే తరహా పోరాటం చేయాలన్నారు. ఈ బ్లాక్ బిల్లుతో సొంతగడ్డ పైనే తమిళులను శరణార్థులుగా మార్చాలని బీజేపీ చూస్తుందని ఆయన ఆరోపించారు.
ఇవాళ ఈ బిల్లు ముసాయిదా కాపీని తగలబెట్టి, నల్లజెండా ఎగరవేసి మరో జ్వాలను రగిలించానని, ఈ మంటలు బీజేపీ గర్వాన్ని అణచివేస్తాయని సీఎం స్టాలిన్ అన్నారు. ఈ పునర్విభజన ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్యను 543 నుంచి 850కి పెంచాలని భావిస్తున్నారు. ఇందులో రాష్ట్రాలకు 815, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాలను కేటాయించే అవకాశం ఉంది.
ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య భారీగా పెరుగుతుందని.. దీనివల్ల రాష్ట్రాల హక్కులకు భంగం కలుగుతుందని తమిళనాడు మంత్రి అన్బిల్ మహేష్ ఆరోపిం చారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఈ మార్పుల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్‌కు పూర్తి మద్దతు ఉన్నప్పటికీ, ఓబీసీలు, దళితులు, ఆదివాసీల హక్కులకు భంగం కలిగించే విధానాలను అనుమతించబోమని స్పష్టం చేశాయి. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలు ఏకమై పార్లమెంట్‌లో వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించాయి.






