19 March, 2026 | 4:49 AM

నా ఉద్దేశం అది కాదు

19-03-2026 01:49 AM
  1. పీసీసీ చీఫ్‌ను మార్చాలని అనలేదు 
  2. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

హైదరాబాద్, మార్చి18 (విజయక్రాంతి) : జగ్గారెడ్డికి పీసీసీ పదవి ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్సెస్ బీసీ వివాదానికి దారితీశాయి. ప్రస్తుతం బీసీ వర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీగా కొనసాగుతున్న తరుణంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగ్గారెడ్డిని పీసీసీ చేయాలని, అలా చేస్తే వంద సీట్లు సాధిస్తామని మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీసీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం స్పందించారు.

పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఆయన నాయకత్వంలోనే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించామని చెప్పారు. అయితే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందును ఘనంగా ఏర్పాటు చేశారని, ఆయనకు పీసీసీ పదవి ఇస్తే బాగుంటుందని మాత్రమే చెప్పానని తెలిపారు. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్‌కుమార్‌గౌడ్‌ను తొలగించాలనేది తన ఉద్దేశం కాదన్నారు.  కొందరు తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.