calender_icon.png 13 September, 2024 | 12:03 AM

ఆ పైసలున్నయ్‌గా?

05-09-2024 01:04:30 AM

రాష్ట్రం వద్ద 1,345 కోట్ల విపత్తు నిధి.. అవి వాడుకొనేందుకు కేంద్రం అనుమతి

తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అవి వాడుకోవచ్చు

వరద నష్టం అంచనాకై ఏరియల్ సర్వే

ఏపీ, తెలంగాణలో సర్వేకు అమిత్ షా ఆదేశం

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

సిరిసిల్లకు పవర్ లూం క్లస్టర్..యార్న్ డిపో

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు బండి వినతి

* రాష్ర్ట ప్రభుత్వం నిధుల వినియోగంపై యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించకపోవడం వల్లే ఈ ఏడాది జూన్‌లో రావాల్సిన రూ.208.40 కోట్లను కేంద్రం విడుదల చేయలేదు. యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించిన వెంటనే నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. 

 కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం తన వద్ద ఉన్న జాతీయ విపత్తు నిధి (ఎన్డీఆర్‌ఎఫ్) ని వరద బాధితుల కోసం ఎందుకు వాడటం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ.1345 కోట్ల ఎన్డీఆర్‌ఎఫ్ నిధులు ఉన్నాయని, వాటిని వరద బాధితుల కోసం వాడేందుకు కేంద్రం అనుమతి కూడా ఇచ్చిం దని చెప్పారు.

వర్షాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీగా నష్టం వాటిల్లిన నేపథ్యంలో వెంటనే ఏరియల్ సర్వే చేయించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. తాను, మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వరద నష్టం విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లగా సహాయం అందించేందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర ఉన్నతాధికారుల బృందం ఏరియల్ సర్వే నిర్వహిస్తుందని వెల్లడించారు.

యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోయినా..

అకౌంటెంట్ జనరల్ నివేదిక ప్రకారం రాష్ర్టం వద్ద ఉన్న రూ.1,345 కోట్ల ఎస్డీఆర్‌ఎఫ్ నిధులను వాడుకొని బాధితులకు సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ సూచించారు. విపత్తుల నిధికి సంబంధించి కేంద్రం ఎప్పటికప్పుడు తన వాటాను రాష్ట్రానికి విడుదల చేస్తోందని వెల్లడించారు. తెలంగాణలో ఎస్డీఆర్‌ఎఫ్ నిధుల వినియోగం, మంజూరుపై అమిత్ షా దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు బండి తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం నిధుల వినియోగంపై యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించకపోవడం వల్లే ఈ ఏడాది జూన్‌లో రావాల్సిన రూ.208.40 కోట్లను కేంద్రం విడుదల చేయలేదని వివరించారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించిన వెంటనే నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు. 

సిరిసిల్లకు పవర్‌లూం క్లస్టర్‌పై వినతి

తెలంగాణలో నేత కార్మికులకు ప్రఖ్యాతి గాంచిన సిరిసిల్లకు పవర్ లూం క్లస్టర్ ఏర్పా టు చేయాలని బండి సంజయ్ కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ను కోరారు. గిరి రాజ్‌సింగ్‌ను బుధవారం కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పవర్ లూం క్లస్టర్‌తోపాటు నేషనల్ హ్యాండ్లూం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేతన్నలు కొనుగోలు చేసేందుకు అవసరమైన ముడిసరుకు డిపో (యార్న్ డిపో)ను ఏర్పాటు చేయాలని కోరా రు. ముడిసరుకు ఖర్చుల కారణంగా నేతన్నలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సబ్సిడీని 80 శాతం మేరకు పెంచాలని వినతిపత్రం అందజేశారు.

సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్‌ను ఏర్పాటు చేయ డంవల్ల వేలాది మంది నేత కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ముఖ్యంగా యంత్రాల ఆధునీకరణతోపాటు ఉత్పాదకతను, కార్మికుల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచుతుందని తెలిపారు. నాణ్యమైన వస్త్రాలను అందించ డంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. యార్న్ డిపో ఏర్పాటువల్ల సిరిసిల్లో నేత కార్మికులకు ముడి సరకులు సులభంగా తక్కువ ధరకు లభిస్తాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం నేత కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, పెరిగిన ఖర్చుల వల్ల ముడి సరకులను కూడా కొనుగోలు చేయడం కష్టమైం దని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని 80 శాతానికి పెంచడంతోపాటు పావలా వడ్డీకే రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బండి విజ్ఞప్తికి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. యార్న్ డిపో ఏర్పాటుతో పాటు పవర్ లూం క్లస్టర్ మంజూరుపై చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.