కోల్‌కతా ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలి
- ఆందోళన చేస్తున్న వైద్యులకు సంఘీభావం
- వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): కోల్‌కతా ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు, నర్సులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలుపుతున్నట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సీబీఐ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులకు కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో సిబ్బందికి భద్రత కల్పించాలని మంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది భద్రతపై ఆయన ఉన్నతాధికారులతో మంత్రి చర్చించారు. డాక్టర్లు, నర్సులు, సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. మహిళల భద్రతపై ఇప్పటికే షీ టీమ్స్ విజయవంతంగా పనిచేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. వైద్యుల భద్రతకు కట్టుబడి ఉన్నామని మంత్రి వెల్లడించారు. ఈ నెల 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలి హత్యాచారం ఘటనపై వారం రోజులుగా వైద సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి రాజనర్సింహ శుక్రవారం స్పందించారు.






