21 June, 2026 | 1:31 AM

కులగణన చేయకుండా ఎన్నికలకు వెళితే ఆమరణ దీక్ష: బీసీ సంఘాలు

17-08-2024 12:28 AM

హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయకుండా స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే అదే రోజు ఆమరణ దీక్షకు దిగుతామని బీసీ సంఘాలు హెచ్చరించాయి. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడారు. బీసీలకు సర్పంచ్, ఎంపీటీసీ, డ్పీటీసీలు అయ్యే అర్హత లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

బీసీల సమస్యల కోసం ఎంత త్యాగమైనా చేస్తానని ప్రకటించారు. బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు కులగణన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని సూచించారు. బీసీ సంఘాలు ఏకతాటిపై వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రాజారాం యాదవ్ ప్రసంగిస్తూ కామారెడ్డి డ్లికరేషన్ అమలు చేస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటని ప్రశ్నించారు. సమగ్ర కులగణన చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లితే బీసీల ఉగ్రరూపం చూపిస్తామని హెచ్చరించారు.

రిజర్వేషన్లపై 50శాతం పరిమితి ఎత్తివేస్తామని దేశ వ్యాప్తంగా రాహుల్‌గాంధీ ప్రచారం చేశారని, తెలంగాణలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరిని ఎండగడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేకపోతుల నరేందర్‌గౌడ్, బత్తులు సిద్దేశ్వర్, రాజయ్య పాల్గొన్నారు.