ఏపీ పారిశ్రామికాభివృద్ధిపై టాస్క్‌ఫోర్స్
చైర్మన్‌గా సీఎం చంద్రబాబు, కో చైర్మన్‌గా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయ క్రాంతి): ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి కోసం టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీలో పెట్టుబడుల సాధనకు, వేగవంతమైన పారిశ్రామికాభివృద్ధి సాధించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 రూపకల్పనపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు.
దేశంలో పేరున్న పారిశ్రామికవేత్తలు, బిజినెస్ సెక్టార్ ప్రముఖులు, ఆయా రంగాల్లో నిపుణులు ఈ టాస్క్ ఫోర్స్‌లో ఉండనున్నారు. టాస్క్‌ఫోర్స్‌కు చైర్మన్‌గా సీఎం చంద్రబాబు, కో చైర్మన్‌గా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ వ్యవహరించనున్నారు. శుక్రవారం సచివాలయంలో చంద్రబాబుతో టాటా చైర్మన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. విశాఖలో టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు, రాష్ట్రంలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ విస్తరణతోపాటు పలు అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్‌తో సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్న సోలార్ పవర్, టెలికమ్యూకేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపైనా కూడా చర్చించారు.
ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. ఏపీ పారిశ్రామికాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుంది. అనంతరం సీఐఐ బృందం సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. రాష్ట్రంలో తీసుకొస్తున్న పారిశ్రామిక విధానంపై సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ బృందంతో సీఎం చర్చించారు.
అమరావతిలో సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్‌షిప్ ఆన్ కాంపిటేటివ్‌నెస్ సంస్థ ఏర్పాటుకు సీఐఐ ముందుకు వచ్చింది. దీనిలో టాటా గ్రూప్ భాగస్వామి కానుంది. అనంతరం చంద్రబాబును బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్, సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా, కౌన్సిల్ సభ్యులు కలిశారు. అమరావతిలో ఇంటర్నేషనల్ లా స్కూల్ ఏర్పాటుపై సీఎంతో చర్చించారు.






