ప్రేక్షకులు పగలబడి నవ్వేస్తున్నారు
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా తెరకెక్కిన చిత్రం ‘రాకాస’. ఈ సినిమాతో దర్శకురాలు మానసశర్మ వెండితెరకు పరిచయమయ్యారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో శుక్ర వారం మధ్యాహ్నం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. “రాకాస’కు ప్రీమియర్ల నుంచే మంచి స్పందన వచ్చింది.
విడుదలైన తర్వాత థియేటర్లలోనూ అంతే స్థాయిలో ఆదరణ దక్కుతోంది. పిల్లలతో సహా తల్లిదండ్రులు ఈ సినిమాకు వస్తున్నారు. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు” అన్నారు. కథానాయకి నయన్ సారిక మాట్లాడుతూ.. “రాకాస’కు వస్తున్న స్పందన చూసి చాలా సంతోషిస్తున్నా. ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. అన్నివర్గాల ప్రేక్షకులు మా సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
అన్నిచోట్లా హౌస్‌ఫుల్స్ పడ్డాయి” అని తెలిపింది. మానసశర్మ మాట్లాడుతూ.. “చందమామ లాంటి కథ అని మేం ముందు నుంచీ చెబుతూనే ఉన్నాం. అదే విషయం ప్రేక్షకుల వరకూ చేరింది. ఇప్పుడు థియేటర్లలో వస్తున్న స్పందన చూసి ఆనందమేస్తోంది. చాలా చోట్ల ప్రేక్షకులు పగలబడి నవ్వేస్తున్నారు. అంతలా ప్రేక్షకులు మా సినిమా ఆస్వాదిస్తుంటే సంతోషంగా ఉంది” అని చెప్పారు. ‘వినోదం పంచాలనే ఉద్దేశంతో తీసిన మా ‘రాకాస’ను చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నార’ని నిర్మాత నిహారిక తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో అనుదీప్ దేవ్, జీ స్టూడియో కంటెంట్ హెడ్ దివ్య, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.




