4 April, 2026 | 4:18 AM

హిందూ-ముస్లిం ప్రేమకథ మొదలు..

04-04-2026 02:38 AM

‘శంబాల’తో తన కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్న హీరో ఆది సాయికుమార్ మరో ఆసక్తికర సినిమాతో రాబోతున్నారు. ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో తెరకెక్కనున్న తన నెక్స్ ప్రాజెక్టును ఆదిసాయి శుక్రవా రం అధికారికంగా ప్రకటించారు. ‘సైరాబాను’ అనే టైటిల్‌తో ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. ఇందులో బంధవి శ్రీధర్ హీరోయిన్. రాజమండ్రి, హైదరాబాద్ నేపథ్యంలో హిందూ-ముస్లిం ప్రేమకథతో రూపొందనున్న ఈ సినిమాను శుక్రవారం పూజా కార్యక్రమంతో ప్రారంభించారు మేకర్స్.

ముహూర్తపు సన్నివేశానికి హీరో కిరణ్ అబ్బవరం క్లాప్ కొట్టారు. దర్శకుడు రామ్ అబ్బరాజు, సాయికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కోన వెంకట్, ‘కే ర్యాంప్’ డైరెక్టర్ నాని మేకర్స్‌కు స్క్రిప్టును అందించారు. తొలి సన్నివేశానికి దర్శకుడు యోగి గౌరవ దర్శకత్వం వహించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రానికి రామ్‌రెడ్డి డీవోపీ కాగా, శేఖర్ చంద్ర సంగీత దర్శకత్వం వహించనున్నారు. చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.