కుటుంబ భావోద్వేగాల పళ్లిచట్టంబి
మలయాళ స్టార్ టొవినో థామస్ నటిస్తున్న బహుభాషా చిత్రం ‘పళ్లిచట్టంబి’. ఈ చిత్రాన్ని నౌఫల్, బ్రిజీష్, చాణక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ నెల 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూలో హీరో టొవినో థామస్, హీరోయిన్ కయదు లోహర్ చిత్ర విశేషాలను తెలిపారు. హీరో టొవినో థామస్ మాట్లాడుతూ.. “పళ్లిచట్టంబి’ కథ కుటుంబ భావోద్వేగాలతో సాగుతుంది.
ఈ కథ ప్రకారం హీరో బలంగా కనిపించాలి. విలన్స్‌ను విసిరిపారేసేలా ఉండాలి. అందుకే అప్పటిదాకా డైటింగ్ చేసే నేను అది పక్కనపెట్టి, బరువు పెరిగా. హెయిర్ స్టైల్, మీసంకట్టుతో ఒక మంచి లుక్‌లోకి మారా. తెలుగులో ఇప్పటిదాకా చాలా మూవీస్‌కు డిస్కషన్స్ జరిగాయి. కానీ ఏదీ కన్ఫర్మ్ కాలేదు. మలయాళంలో నేను స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉన్నా. అక్కడ మూవీస్ వదిలి మరో భాషకు వస్తే నన్ను నమ్ముకుని ప్రాజెక్టులు చేసేవాళ్లు నష్టపోతారు.
మా చిత్రంలో మానవత్వం ముఖ్యమనే పాయింట్‌ను చూపిస్తున్నాం. నా వ్యక్తిగత అభిప్రాయంలో కూడా మనమంతా ఒక్కటే. ఈ సినిమాలో మతాల గురించిన ప్రస్తావన, ఏ మతాన్ని తక్కువ చేయడం కానీ చూపించలేదు. కథానుసారం చర్చి నేపథ్యంగా సన్నివేశాలుంటాయి. ఆ స్థలంలో మరో ఆలయాన్ని పెట్టుకున్నా, కథలో మార్పేమీ ఉండదు. సోషియో పొలిటికల్ అంశాలు ప్రధానంగా ఉంటాయి.
సినిమాను ఆస్వాదించేందుకు భాష అవసరం లేదు” అని చెప్పారు. హీరోయిన్ కయదు లోహర్ మాట్లాడుతూ.. “ఇప్పటిదాకా నేను ఏ మూవీలో నటించని తరహా పాత్ర ఈ సినిమాలో చేశాను. గ్లామర్ అనే కోణంలో ప్రేక్షకులు నా పాత్రను చూడరు. ఈ సినిమా నన్ను నాయికగా మరింత మంచి పొజిషన్‌కు తీసుకెళ్తుందనే నమ్మకం ఉంది. నేను బయటకు మోడరన్ అమ్మాయిలా కనిపిస్తా కానీ రూరల్ అమ్మాయి మనస్తత్వమే నాలో ఉంటుంది.
నాకు తెలియని భాషల్లో సినిమాలు చేస్తున్నప్పుడు ఆ మూవీ కోసం తప్పకుండా వర్క్‌షాప్స్ చేస్తా. ఈ సినిమా కోసం కూడా అలాంటి వర్క్‌షాప్స్ చేశా. అయితే డిజో స్క్రిప్ట్ పరిధిలోనే ఆలోచించి, నటించమని చెప్పారు. మనం ఎక్కువ రీసెర్చ్ చేసినా కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే డిజో చెప్పినట్లు స్క్రిప్ట్‌లో ఉన్నది పర్‌ఫార్మ్ చేశాం” అని తెలిపింది.




