బీసీ బాలికల కళాశాల వసతి గృహాన్ని వెంటనే ప్రారంభించాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 15 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఎదురుగా నిర్మించిన బీసీ బాలికల కళాశాల వసతి గృహాన్ని వెంటనే ప్రారంభించాలని సీపీఎం జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తయిన వసతి గృహాన్ని పార్టీ నాయకులు సందర్శించారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దుర్గం దినకర్ మాట్లాడుతూ వసతి గృహ నిర్మాణం పూర్తు దాదాపు రెండేళ్లు గడుస్తున్నప్పటికీ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. దీంతో బీసీ బాలికల కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత పదేళ్లుగా బీసీ బాలికల వసతి గృహం అద్దె భవనంలో అరకొర సౌకర్యాలతో, ఇరుకు గదుల్లో విద్యార్థినులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు.
ఈ సమస్యపై గతంలో పలుమార్లు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించినా స్పందన లేకపోయిందన్నారు.నూతన వసతి గృహాన్ని ప్రారంభిస్తే సుమారు 300 మంది విద్యార్థినులకు మెరుగైన వసతి సౌకర్యాలు అందుతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి వసతి గృహాన్ని ప్రారంభించాలని, లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రారంభం అయ్యే వరకు దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గోడిసెల కార్తీక్, గేడం టికానంద్, తిరుపతి, రాజ్కుమార్, మల్లేష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.






