బోగస్ బడ్జెట్.. ఝూటా బడ్జెట్
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బోగస్ బడ్జెట్, ఝూటా బడ్జెట్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ బడ్జెట్‌తో ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని విమర్శించారు. వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చిన పెన్షన్ పెంపు హామీలను కూడా సర్కారు మరిచిపోయిందని ఎద్దేవా చేశారు.
మహిళలకు నెలకు రూ.2,500 పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు కేవలం ఓట్ల కోసమే అని తేలిపోయింది. మూడేళ్లలో 3.5 లక్షల కోట్లు అప్పులు దండిగా చేశారు. మా పాలనలో 12.5% ఉన్న జిఏస్ డీపీ, వీరి తుగ్లక్ పనులు, హైడ్రా వల్ల 10.7% కి పడిపోయింది. క్యూర్, ప్యూర్, రేర్ పేర్లతో చోర్,గోల్ మాల్ మోడల్ నడుపుతున్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, సింగరేణి, ఆర్టీసీ కార్మికులకు మొండిచేయి చూపారు’ అని విమర్శించారు.
మాజీ మంత్రి హరీష్‌రావు
‘అన్ని వర్గాలకు న్యాయం చేసే బడ్జెట్ ఇది. బడ్జెట్ వినని బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ ద్రోహులు. వారి వక్రబుద్ధి మార్చుకోవాలి’ అని విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.
విప్ బీర్ల ఐలయ్య
గురుకులాల సిబ్బందికి పెండింగ్ బిల్లులు లేకుండా సీఎం, డిప్యూటీ సీఎం చొరవ తీసుకున్నారు. గత ప్రభుత్వం లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ భవనానికి శిలాఫలకం వేసి వదిలేసింది. మా ప్రభుత్వం అక్కడ అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ నిర్మించబోతోంది. అడ్రస్ లేని బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు.
అడ్లూరి లక్ష్మణ్, మంత్రి
బడ్జెట్ చూసి బీఆర్‌ఎస్ నేతల ముఖాల్లో రంగులు మారాయి. భవిష్యత్ అభివృద్ధి కళ్లకు కట్టడంతో మానసిక స్థితి కోల్పోయి సభలో చిల్లర వేషాలు వేశారు. వచ్చే ఎన్నికల్లో వారిని నర్సరీలో కూర్చోబెట్టాలి. బీజేపీ వాళ్లు హుందాగా విన్నారు. ఇది అద్భుతమైన బడ్జెట్.
యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే
ఇది జనరంజక బడ్జెట్. దేశంలో ఇండ్ల నిర్మాణానికి రూ. 5 లక్షలు ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు. ఇందిరమ్మ జీవిత బీమా, నగదు రహిత వైద్యం ఇస్తుంటే తట్టుకోలేక బీఆర్‌ఎస్ వాళ్లు బడ్జెట్ ప్రతులు చించివేశారు. ఫోర్త్ సిటీ, మూసీ ప్రక్షాళన అనగానే వాకౌట్ చేశారు. గతం పదేళ్లలో వీళ్లు వేములవాడకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.
ఆది శ్రీనివాస్, విప్, ఎమ్మెల్యే
విజన్ ఉన్న బడ్జెట్ ఇది. పదేళ్లు ప్రజల చెవిలో పూలు పెట్టిన బీఆర్‌ఎస్ నేతలు, ఇప్పుడు వీధి కోతుల్లా వింత చేష్టలు చేస్తున్నారు. విద్యా, వైద్యం, ఇరిగేషన్కు బడ్జెట్లో పెద్దపీట వేశారు.
రాంచంద్రు నాయక్, ఎమ్మెల్సీ
మాలాంటి సిన్సియర్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది. సామాజిక న్యాయం పాటించే ఏకైక పార్టీ కాంగ్రెస్. బడ్జెట్‌లో దళితులు, బడుగులకు తగిన ప్రాధాన్యం దక్కింది.
అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ
కష్టపడి పనిచేసే వారికి కాంగ్రెస్ ఎప్పుడూ గుర్తింపు ఇస్తుంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తాం. బడ్జెట్‌లో అన్ని వర్గాలకు, సంక్షేమ పథకాలకు సముచిత న్యాయం జరిగింది.
బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీ
బడ్జెట్ అంతా ఒక మోసం. నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ నియామకాల ప్రస్తావన లేదు. 15 వేల రైతు భరోసా, పెన్షన్ల పెంపు గురించి మాట్లాడలేదు. ఎస్సీ, బీసీ సబ్ ప్లాన్ విషయంలో మోసం చేశారు. కేవలం కాంట్రాక్టులు, కుంభకోణాల బడ్జెట్.
జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే
స్కీములను మరిపించి స్కాములకు తెరలేపారు. బీసీలకు ఇస్తామన్న రూ.20 వేల కోట్లు ఇవ్వకుండా గొంతు కోశారు. తులం బంగారం ఇవ్వకుండా సమ్మక్క సారక్క బెల్లమే బంగారం అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ బడ్జెట్‌లో కోత పెట్టారు.
గంగుల కమలాకర్, ఎమ్మెల్యే
హైదరాబాద్ ప్రజలను మోసం చేస్తున్నారు. నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించి దోచుకుని ఢిల్లీకి మూటలు పంపే కుట్ర చేస్తున్నారు. లేని ఫోర్త్ సిటీకి మెట్రో తీసుకెళ్తారట. డబుల్ బెడ్రూం ఇండ్లు ఒక్కటి కూడా కట్టలేదు. మూసీ ప్రక్షాళన పేరుతో కుంభకోణానికి తెరలేపారు.
కేపీ వివేకానంద్, ఎమ్మెల్యే
ఇది హాట్రిక్ చీటింగ్ బడ్జెట్. ఆర్థిక విధ్వంసానికి బాటలు వేసింది. అప్పుల కుప్పగా, వాస్తవికతకు దూరంగా, ఊహాజనితంగా ఉంది. ముస్లింలతో పోలిస్తే బీసీలకు అన్యాయం జరిగింది. విద్యాశాఖకు 15% నిధులు ఇస్తామని చెప్పి కేటాయించలేదు. యువత, మహిళలను మోసం చేశారు.
మహేశ్వర్‌రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత
బడ్జెట్‌లో బీసీ సబ్ ప్లాన్ ఊసే లేదు. బీసీలను పూర్తిగా విస్మరించారు. విమాన ప్రమాదంలో చనిపోతే రూ.2 కోట్లు ఇస్తారట కానీ, పెన్షనర్ల డబ్బులు ఇవ్వరు. స్కాలర్షిప్లు రాక విద్యార్థులు హోటళ్లలో పనిచేసుకుంటున్నారు. రైతు భరోసా ప్రస్తావనే లేదు.
పాయల్ శంకర్, ఎమ్మెల్యే




