30 April, 2026 | 4:04 AM

కేడర్‌కు మొండి‘చేయి’

30-04-2026 02:49 AM
  1. కాంగ్రెస్‌లో ద్వితీయశ్రేణి నేతల అసంతృప్తి
  2. నిరాశ నిస్పృహల్లో నాయకులు
  3. రెండున్నరేళ్లవుతున్నా పదవులీయలే 
  4. మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ పేర్లతో కొర్రీలు
  5. పార్టీ కార్యక్రమాలంటేనే ఆమడదూరం
  6. హస్తం జెండా మోసిన వారికే నిరాశ
  7. సొంతడబ్బు, సమయం వృథా అని ఆవేదన

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): పదేళ్లు పార్టీ పదవిలోకి వస్తుందని కష్టపడి పనిచేసి, తీరా పార్టీ అధికారంలోకి వచ్చాక ఏదోఒక పదవి దక్కుతుందనుకుంటే తమ ఆశ నిరాశే అవుతుందని కాంగ్రెస్ పార్టీలో ఏళ్లుగా శ్రమిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులు వాపోతున్నారు. ఇప్పటికే అధికారంలోకి వచ్చి రెం డున్నరేళ్లు గడిచిపోయిందని, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లతో కొర్రీలు పెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీకోసం కష్టపడ్డా తమకు మొండి చేయే చూపిస్తున్నారని ద్వితీయశ్రేణి నాయకత్వం పార్టీ కార్యక్రమాల్లో ఆసక్తి ప్రదర్శించడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత డబ్చు ఖర్చుపెట్టుకుని ఉత్సాహం పార్టీ కార్యక్రమాలు నిర్వహించినా పార్టీ నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్ కార్యక్రమాలం టే పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితి కనిపిస్తోంది.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని క్షేత్ర స్థాయిలోకి ప్రజల్లోకి తీసుకెళ్లాలి, పార్టీని మరింత బలోపేతం చేయాలని చెబుతున్న కాంగ్రెస్ నాయకత్వం, ఇక  పదవుల విషయానికి వచ్చేసరికి ద్వితీయశ్రేణి నాయకత్వానికి మొండిచెయ్యి చూపిస్తుం దనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు పార్టీ లేదా ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు కావాలంటే.. ఆ జిల్లాకు చెందిన వారు రెఫరె న్స్ కావాలనడమేంటీ? అని అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. జిల్లాకు చెందిన మంత్రి లేదా, ఎమ్మెల్యేనో, ఎంపీనో రెఫరెన్స్ ఇస్తేనే పదవీ ఇస్తామని పీసీ సీ నాయకత్వం, అటు ప్రభుత్వంలోని పెద్దలు తెగేసి చెబుతున్నారు. పార్టీ పదేళ్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలు తమకు అప్పజెప్పినప్పుడు కూడా ఎమ్మెల్యే, ఎంపీలను ముందు పెట్టాల్సిందని మండిపడ్డారు. 

ఎంపీ లేదా ఎమ్మెల్యే వారి చెప్పుచేతల్లో ఉన్నవారి పేర్లు ప్రకటించుకుంటారని, ఆదినుంచి కష్టపడ్డ తాము ఎటువెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి  నుంచి పార్టీ కో సం పని చేసిన వారిని పక్కన పెడుతున్నారని వాపోతున్నారు. ఇటీవలనే గాంధీభవన్‌లో డీసీసీ, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో జరిగిన సమావేశానికి చాలా మంది గైర్వాజర్ కావడంతో పాటు.. బూత్ లెవల్ కమిటీలో పని చేయడానికి చాలా మంది ఆసక్తి చూపడం లేదని తెలిసింది.

ఒకరిద్దరు నాయకులు మాత్రం పదేళ్లు పార్టీ కోసం కష్టపడి పని చేశామని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా పని చేస్తూనే ఉన్నామని, మా బతుకంతా పని చేయడమేనా? నామినేటెడ్ పోస్టులకు మేం అర్హులం కాదా? అని ఇక పార్టీ కోసం పని చేయడానికి  ఓపికలేదని అగ్రనేతలతో ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తుంది. 

కాంగ్రెస్‌లో సామాజిక న్యాయమం అనేది మాటల వరకే.. 

కాంగ్రెస్ పార్టీలోనే సామాజిక న్యాయం ఉంటుందని, పార్టీ, ప్రభుత్వ పదవుల్ల పంపకాల్లో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుం దనే ప్రచారమంతా వట్టిదనే వాదన కూడా వినిపిస్తోంది. మొదటి విడతలో నియమించిన నామినేటెడ్ పోస్టుల్లో ఒకటి, రెండు వర్గాలకే పెద్ద పీట వేసి, మిగతా వర్గాలను పూర్తిగా విస్మరించారని మండిపడుతున్నారు.

ప్రచారం లో మాత్రం సామాజిక న్యాయం కనబడుతుందని, ఆచరణలో మాత్రం రెండు, మూడు పెద్ద కూలాలకే పదవులు దక్కుతున్నాయని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో అందరం ఒకటే అనడం, అధికారంలోకి వచ్చాక కొన్ని వర్గాలను దూరంగా పెడుతున్నారని పార్టీలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన ద్వితీయశ్రేణి నాయకులు ఆరోపిస్తున్నారు. 

ఇక ఎస్సీ సామాజిక వర్గంలోనూ ఒక వర్గానికే పెద్దపీట వేస్తున్నారని, మిగతా వారిని పట్టించుకోవడం లేదని ఉత్తర తెలంగాణకు చెందిన ఒక సీనియర్ నాయకుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక్కో ఇంట్లో రెండు, మూడు పదవులు ఇవ్వడం సామాజిక న్యాయం ఎలా అవుతుందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. వచ్చే నామినేటెడ్ పదవుల్లోనైనా అన్ని వర్గాలకు న్యాయం చేయాలని, సిఫారస్ లేఖలు లేకుండా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి పదవులు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తున్నారు.