కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ బోగస్
- చెప్పిందొకటి.. చేసేదొకటి
- వడ్ల కొనుగోలు కేంద్రాలకు వెళ్లి చూడాలి
- సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు బహిరంగ లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని, ఎన్నికల వేళ చెప్పిందొకటి.. అధికారం లోకి వచ్చాక చేసేదొకటి అని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవం త్ రెడ్డి.. వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడాలని హితవు పలికారు. పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు బుధవారం బహిరంగ లేఖ రాశారు.
కొనుగోలు కేంద్రాలకు వరిధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ఎందుకు మొదలుపెట్టలేదని ప్రశ్నించారు. మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో, రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని, ఎండల్లో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా అని నిలదీశారు. మాట ఇచ్చిన ప్రకారం సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొద్దుతిరుగుడు రైతుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? అని ప్రశ్నించా రు.
20 రోజులుగా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం పావువంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేసిందని, మిగతా 1.20 లక్షల క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వమే బేషరతుగా కొనాలని డిమాండ్ చేశారు. శనగ రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు శనిలా మారాయని, కేంద్రాల్లో కొర్రీ లు పెట్టి పూర్తిగా కొనుగోళ్లు నిలిపివేశారని తెలిపారు. శనగలకు మద్దతు ధర రూ. 5,875 ఉంటే, ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు మూడు, నాలుగు వేలకే రైతులు అమ్ముకునే దుస్థితి వచ్చిందని స్పష్టం చేశారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు.
కనీస మద్దతు ధర రూ. 3371 ఉంటే, ప్రైవేటు వ్యక్తులకు కేవలం రూ. 2500కే రైతులు నష్టపోతూ అమ్ముకుం టున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించిన మొక్కజొన్న రైతులపై వివక్ష ఎందుకని నిలదీశారు. ఎకరాకు 26.50 క్వింటాళ్లే కొంటామనే నిబంధనను సడలించాలని సూచించారు. ఎకరాకు 30 నుంచి 40 క్విం టాళ్ల మొక్కజొన్న పండితే మిగతా పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలి? అని నిలదీశారు. తక్షణమే అన్ని రకాల పంటలను మద్ద తు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేదంటే రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుందని హరీష్‌రావు హెచ్చరించారు.






