15 July, 2026 | 5:38 AM

కేంద్రం..కుంభకర్ణుడిలా నిద్రపోతోంది

25-12-2024 02:07 AM

* ధరల పెరుగుదలతో ప్రజలకు ఇబ్బందులు

* ఎక్స్ వేదికగా రాహుల్ విమర్శలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. కొన్ని రోజుల క్రితం గిరినగర్‌లోని కూరగాయల మార్కెట్‌కు తాను వెళ్లానని, అక్కడ సామాన్యులను కలసి ధరల పెరుగుదలపై మాట్లాడినట్లు తెలిపారు. ధరల పెరుగుదలతో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నట్లు వివరించారు.

ధరల పెరగ డంతో తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి వస్తుందని రాహుల్‌కు కొందరు మహిళలు  చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న విషయాలకు కూడా పేదలు రాజీ పడాల్సి వస్తుందన్నారు. గతంలో రూ.40 ఉండే కిలో వెల్లుల్లి ధర ప్రస్తుతం రూ.400కు చేరిందని పేర్కొన్నారు. ఈ విధంగా ధరలు పెరుగుతుంటే ప్రజలు ఏం విధంగా పొదు పు చేస్తారని ప్రశ్నించారు.

ద్రవ్యోల్బణం పెరగడంతో పేదోడి వంటగది బడ్జెట్  అదుపు తప్పుతోందన్నారు. ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ధరలను నియంత్రించకుండా కుంభకుర్ణుడి లా నిద్రపోతోందని ఎద్దేవా చేశారు.