రైతులను వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
హరీష్‌రావు ఆగ్రహం
22 రోజులుగా ధాన్యం కొనుగోలు లేక రైతులు ఇబ్బందులు
బుస్సాపూర్ అభివృద్ధి బీఆర్‌ఎస్ హయాంలోనే
సాగునీటి లిఫ్ట్ పనులు నిలిచిపోయాయని విమర్శ
సిద్దిపేట రూరల్, మే 4: సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్ గ్రామంలో జరిగిన బీరప్ప ఉత్సవాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, 22 రోజులుగా వడ్లు, మక్కలు కొనుగోలు చేయక రైతులను కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాచే పరిస్థితి తీసుకొచ్చిందని మండిపడ్డారు.
కేసిఆర్ బయటకు వస్తేనే భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బందు అమలు చేస్తోందని ఆరోపించిన ఆయన, కెసిఆర్ హయాంలో లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో బుస్సాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. యాదవులకు 100 శాతం గొర్రెల యూనిట్లు పంపిణీ చేయడం, కురుమ సంఘ భవనం నిర్మాణం, సీసీ రోడ్లు, డబు ల్ రోడ్లు, ఫంక్షన్ హాల్ వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.
బుస్సాపూర్కు సాగునీటి లిఫ్ట్ మంజూరు చేసి 90 శాతం పనులు తమ హయాంలోనే పూర్తి చేశామని, ప్రస్తుతం ప్రభుత్వం ఆ పనులను నిలిపివేసిందని ఆరోపించారు. త్వరలోనే లిఫ్ట్ పూర్తి చేసి పంట పొలాల వరకు నీరు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీరప్ప మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పత్తి ఐలారెడ్డి, మాజీ సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ చందర్ రావు బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






