పాలమూరు నుంచే కవిత తొలి అడుగు
- తెలంగాణకు జరిగిన అన్యాయంపై గళమెత్తనున్న టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు
- 8న చౌదరిగూడెం వద్ద పాలమూరు ప్రాజెక్టు సాధన సభ
- పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ రక్షణ సేన నాయకులు
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాలమూరు గడ్డ మీది నుంచే రాజకీయంగా మొదటి అడుగు వేయనున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత తన మొదటి ప్రాధాన్యతగా కృష్ణా జలాల సాధనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 8న చౌదరిగూడెం వద్ద ‘పాలమూరు ప్రాజెక్టు సాధన సభ’ నిర్వహిం చనున్నారు. ఇందులో భాగంగా పాలమూరు ప్రాజెక్టు సాధన పోస్టర్‌ను సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు నవీన్ ఆచారి, గొంగళ్ల రంజిత్ కుమార్, సయ్యద్ ఇస్మాయిల్, నరేశ్ ప్రజాపతి, ఎదురుగట్ల సంపత్ గౌడ్, సీమ రమేశ్, బుచ్చిబాబు, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని 12 ఏళ్లు గడిచిన తర్వాత కూడా కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ వెనుకబడి ఉండటానికి పాలకుల లోపభూయిష్ట విధానాలే కారణమని పలు వేదికలపై నుంచి కవిత స్పష్టం చేశారు.
కృష్ణా, గోదావరి నీళ్లను సమర్థవంతంగా వినియోగించుకుంటూ మన బీళ్లకు మళ్లించుకునేందుకు తమ వద్ద స్పష్టమైన విధానాలున్నాయని ప్రకటించారు. ఈ క్రమంలోనే కృష్ణా నీళ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి ప్రాజెక్టుకు సత్వర అనుమతులు సాధించడంతో పాటు పనులు వేగంగా పూర్తి చేయించడానికి ఉద్యమ ప్రణాళిక ప్రకటించే దిశగా కవిత అడుగులు వేస్తున్నారు. తెలంగాణకు హక్కుగా దక్కే ప్రతి చుక్క నీటిని మన బీడు భూములకు మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.






