calender_icon.png 29 September, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొక్కిసలాట వెనుక కుట్ర

29-09-2025 01:41:46 AM

  1. సీబీఐ విచారణ చేయాలి: టీవీకే పార్టీ 
  2. ఒక్కో బాధిత కుటుంబానికి ౨౦ లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన పార్టీ
  3. కరూర్ ఘటనలో 40కి చేరిన మృతుల సంఖ్య
  4. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ
  5. రాళ్ల దాడి జరగలేదన్న పోలీసులు
  6. విజయ్ ఇంటి బయట సెక్యూరిటీ కట్టుదిట్టం

చెన్నై, సెప్టెంబర్ 28: తమిళగ వెట్రి కళగం (టీవీకే) శనివారం నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట వల్ల మృతి చెందిన వారి సంఖ్య 40కి చేరుకుంది. ఆదివారం 31 సంవత్సరాల కెవిన్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుల్లో 10 మంది చిన్నారులు, 16 మంది మహిళలు కూడా ఉన్నారు. కరూర్ మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ రూ. 2 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.

ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి ఇవ్వనున్నారు. ఈ దుర్ఘటన వెనుక కుట్రకోణం దాగి ఉందని టీవీకే ఆరోపించింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టి నిజానిజాలను నిగ్గుతేల్చాలని మద్రాస్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ‘ఈ ఘటన వెనుక కుట్ర దాగుంది. జనసమూహంపై రాళ్లు రువ్వారు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు’ అని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం మధ్యాహ్నం ఈ పిటిషన్ విచారణకు రానుంది.

తమిళనాడు ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఏక సభ్య కమిషన్‌ను నియమించింది. అధికార పార్టీకి చెందిన కొంత మంది కరూర్ జిల్లా నాయకులకు ఈ కుట్రతో సంబంధం ఉందనేందుకు తమ వద్ద ఆధారాలున్నాయని టీవీకే పేర్కొంది. విజయ్ సభకు ఆలస్యంగా రావడం, 1.2 లక్షల చదరుపు అడుగుల స్థలంలోనే ఎక్కువ మందితో సభను నిర్వహించడం వల్లే తొక్కిసలా జరిగిందని డీజీపీ వెంకట్రామన్ వెల్లడించారు.

టీవీకే నాయకులు 10,000 మందితో ర్యాలీ నిర్వహించేందుకు మాత్రమే అనుమతి తీసుకున్నారని తెలిపారు. చెన్నైలో టీవీకే అధినేత విజయ్ ఇంటి బయట భద్రతను కట్టుదిట్టం చేశారు. టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్, జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

రాళ్ల దాడి జరగలేదు: అదనపు డీజీ

విజయ్ నిర్వహించిన ర్యాలీలో రాళ్లు రువ్వడంతో పాటు పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వల్లే గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్టు టీవీకే చేస్తున్న ఆరోపణలపై అదనపు డీజీపీ డేవిడ్‌సన్ స్పందించారు. ‘పార్టీ నేతలు, ప్రజలపై ఎటువంటి దాడి జరగలేదు. తమ ఆదేశాలను ధిక్కరించి టీవీకే నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆలస్యమవడం వల్ల తర్వాత కార్యక్రమం జరగాల్సిన నామక్కల్ నుంచి కూడా అభిమానులు కరూర్‌కు వచ్చారు.

అందువల్లే అక్కడ రద్దీ విపరీతంగా పెరిగిపోయింది’ అని తెలిపారు. టీవీకే చేసిన కుట్ర ఆరోపణలపై డీఎంకే నాయకులు స్పందించారు. ఈ ఘటనను రాజకీయం చేయాలనుకోవడం లేదని చట్టం తన పని తాను చేసుకుని పోతుందని తెలిపారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది.