గణాంకాల వెనుక దాగిన వైరుధ్యాలు
కుందుర్తి గురువాచారి :
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన రాష్ట్ర సా మాజిక గణాంకాలు సంఖ్యల సమాహా రంగా మాత్రమే కనిపించినా, వాటి వెనుక చాలా లోతైన రాజకీయ, సామాజిక, ఆర్థిక సంకేతాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా బీసీలు రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్నారని, ఎస్సీల జనాభా గణనీయ స్థాయిలో ఉందని వెల్లడించే లెక్కలు ఒకవైపు బహుజనవర్గాల పరిమాణాన్ని సూచి స్తుంటే, మరోవైపు వారి భవిష్యత్తు, సామా జిక, -రాజకీయ స్థితిగతులపై కూడా అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
* ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక వాటా, రిజర్వే షన్లు, బడ్జెట్ కేటాయింపులు మాకు ఇవ్వాలని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, కావాలనే బహుజన వర్గాల సంఖ్యను తగ్గించి చూపుతున్నారా? అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది.
దేశవ్యాప్తంగా ఇటీవల వెలువడిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేది కలు దేశంలో జననాల రేటు, మహిళల సగ టు సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతు న్నాయని స్పష్టం చేస్తున్నాయి. ఉద్యోగ అస్థిరత, ప్రైవేట్ విద్యా భారాలు, కార్పొరేట్ వైద్య ఖర్చులు, పట్టణ జీవన వ్యయం పెరగ డం వంటి కారణాలతో మధ్యతరగతి, పేద కుటుంబాలు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలు అనే పరిస్థితికి చేరుతున్నాయి.
ఇది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు; ఆర్థిక వ్యవ స్థ మోపుతున్న ఒత్తిడికి ప్రతిబింబం. ఇదే ఆలోచన సరియైనది అయితే అగ్రవర్ణ - శూద్ర అగ్రకులాలలో కూడా పెద్ద మధ్యత రగతి వర్గం ఉంది కదా? వారిలో కూడా ఇదే ఆర్థిక ఒత్తిడి ఉండాలి కదా? అయితే జనాభా తగ్గుదల చర్చ ఎందుకు ప్రధా నంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకే పరిమితం అవుతోంది? అనే ప్రశ్న సహజంగానే తలె త్తుతోంది. ఇదే ఇప్పుడు సామాజిక అనుమా నాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.
ఇక్కడ మనం గమనించవలసిన ఒక నిర్దిష్టమైన విషయం ఉంది. నేను చెబుతున్న విషయం ఏమంటే, రోజురోజుకు ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా పెరగాలి గాని ఎందుకు తగ్గుతున్నట్టుగా చర్చ వస్తోంది? నిజంగా తగ్గుతుందా? లేక తగ్గించి చూపుతున్నారా? అనే అనుమానం సహజంగానే కలుగు తోంది. ఎందుకంటే ఇదే సమయంలో దేశ జనాభా మాత్రం ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుతోందని చెబుతున్నారు. ఒక వైపు దేశ జనాభా పెరుగుతోందని అం టూనే, మరోవైపు బహుజన వర్గాల జనాభా తగ్గుతోందనే వాదనలు రావడం అనేక సందేహాలకు దారితీస్తోంది.
ఇందులో మరొక కోణం కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక వాటా, రిజర్వే షన్లు, బడ్జెట్ కేటాయింపులు మాకు ఇవ్వా లని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, కావాలనే బహుజన వర్గాల సంఖ్యను తగ్గిం చి చూపుతున్నారా? అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే ప్రపం చ జనాభాలో భారతదేశం మొదటి స్థానా నికి చేరుతుంటే, అదే దేశంలో బహుజన వర్గాల సంఖ్య తగ్గుతోందనే ప్రచారం ఎలా వస్తోంది? ఇదే అసలు చర్చించాల్సిన ప్రశ్న.
నిజమే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఆరోగ్యం, విద్య, కుటుంబ పోషణ, ఉపాధి, వైద్యం వంటి రంగాల్లో తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. చిన్న కుటుంబాలకు పరిమితం అవుతున్న వాస్తవం కూడా ఉం ది. కానీ, ఆ వాస్తవం పేరుతో భవిష్యత్తులో వారి సామాజిక,-రాజకీయ వాటాను బలహీ నపరిచే పరిస్థితి ఏర్పడకూడదు.
అదే సమయంలో రెడ్డి, కమ్మ, వెలమ, బ్రాహ్మణ, వైశ్య, కొంతవరకు కాపు వంటి అగ్ర లేదా ఆర్థిక ఆధిపత్య వర్గాల ప్రభావం ఎందుకు పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది? ప్రభుత్వాలు ఎందుకు అలా ప్రకటిస్తు న్నాయి? అనేది మౌలిక ప్రశ్న. ఇక్కడ గమ నించాల్సిన విషయం ఏమిటంటే, ప్రస్తుతం అధికారిక సమగ్ర కులగణన లేదు. అలాం టప్పుడు కొన్ని అగ్రవర్ణాలు లేదా అగ్రకు లాల ప్రభావం, జనాభా పెరిగినట్టుగా ఎలా నిర్ధారిస్తున్నారు? ఇదే ఇప్పుడు బహుజన స మాజంలో అనుమానాలకు కారణమవుతోంది.
ఇక్కడ మరో ముఖ్యమైన అంశం రాజకీ య బాధ్యతకు సంబంధించినది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ గణాంకాలు గత ప్రభుత్వ హయాంలో సేకరించిన సర్వేల ఆధారంగా వెలుగులోకి వచ్చాయని చెబు తున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం వాటి ని ప్రకటిస్తూనే, అవి తాము సేకరించిన లెక్క లు కావనే దూరాన్ని కూడా ఉంచు కుంటోంది.
ఇదే అసలు రాజకీయ వైరు ధ్యం. నిజంగా ఈ గణాంకాలపై పూర్తి నమ్మ కం ఉంటే, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వతంత్రంగా తాజా సమగ్ర, సామాజిక-కులగణన చేపట్టి, గత లెక్కలతో పోల్చి ప్రజల ముందుంచాల్సిన బాధ్యత ఉంది. అప్పుడు మాత్రమే ఏది నిజమైన జనాభా ధోరణి? ఏది రాజకీయ ప్రచారం? అనే విషయం స్పష్టమవుతుంది.
ఇంకా ఒక కీలక అంశం ఉంది. అదే మం టే, 1931 తర్వాత దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి కులగణన జరగలేదు. అందు వల్ల ప్రస్తుతం వినిపిస్తున్న అనేక సంఖ్యలు రాజకీయ అంచనాలు, సామాజిక ప్రచారా లు, పరిమిత సర్వేల ఆధారంగానే తిరుగు తున్నాయి. ఈ పరిస్థితిలో బహుజన వర్గాల జనాభా తగ్గుతోందని, కొన్ని వర్గాల ప్రభా వం పెరుగుతోందనే చర్చలు సహజంగానే అనుమానాలకు దారితీస్తున్నాయి. అందుకే సమగ్ర, పారదర్శక, శాస్త్రీయ కులగణన అవసరం ఇప్పుడు మరింత పెరిగింది.
ఎందుకంటే జనాభా అనేది కేవలం సంఖ్య కాదు. అది రాజకీయ ప్రాతినిధ్యం, బడ్జెట్ కేటాయింపులు, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, నియోజకవర్గాల పునర్విభజన, వనరుల పంపిణీ వంటి అనేక అంశాలకు పునాది. కాబట్టి జనాభా గణాంకాలపై నిజ మైన ప్రజాస్వామ్య చర్చ జరగాలంటే, ఏ పార్టీ సేకరించిన లెక్కలైనా సరే, పూర్తి డేటా ప్రజల ముందుకురావాలి.
లేకపోతే గణాం కాలు ప్రజాస్వామ్య సాధనాలుగా కాకుండా రాజకీయ ప్రయోజనాల ఆయుధాలుగా మారే ప్రమాదం ఉంటుంది. బహుజనుల సంఖ్య తగ్గుతోందా? లేక వారి సంఖ్యను, ప్రభావాన్ని తగ్గించి చూపే రాజకీయ కథనాలు పెరుగుతున్నాయా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పేది పారదర్శక కులగణన మాత్రమే. లేకపోతే భవిష్యత్తులో జనాభా గణాంకాలే సామాజిక న్యాయ పోరాటాలకు కొత్త యుద్ధభూమిగా మారు తుందన్న విషయం పాలకులు మర్చి పోరాదు.
వ్యాసకర్త: ఏపీ వెనుకబడిన తరగతుల (బీసీ) కమిషన్
మాజీ సభ్యులు, 95500 22293






